నల్లధనంపై కేంద్రం ప్రకటించిన ముగ్గురి పేర్లతో కూడిన జాబితా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 700 మంది బ్లాక్-మనీ ఖాతాదారుల్లో కేవలం ముగ్గురు వ్యక్తుల పేర్లతో సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు ప్రవాస భారతీయుడిగా ఉన్నప్పుడు తాను అకౌంట్ తెరిచినట్టు డాబర్ మాజీ డైరెక్టర్ ప్రకటించడం విశేషం. ఈ వ్యవహారమంతా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు బ్లాక్-మనీని వెనకకు తెచ్చే ఉద్దేశ్యం మోదీ సర్కారుకుందా అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి. బ్లాక్-మనీ జాబితాలో ముగ్గురు పేర్లను కేంద్రం బహిర్గతం చేసినదానిపై వచ్చిన ప్రముఖుల స్పందన ఇలా ఉంది. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం డాబర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, రాజ్-కోట్కు చెందిన పారిశ్రామికవేత్త పంకజ్ చిమన్-లాల్ లోధియా, గోవాకు చెందిన గనుల యజమాని రాధా టింబ్లో పేర్లను జాబితాలో పేర్కొంది. తొలి జాబితాలో రాజకీయ ప్రముఖుల పేర్లు లేకపోవడంపై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. స్విస్ బ్యాంక్-లో తనకు అకౌంట్ లేదంటున్నారు వ్యాపారవేత్త పంకజ్ లోధియా. అసలు తనకున్న యావత్ ఆస్థుల వివరాలు ఐటీ డిపార్ట్-మెంట్-కు సమర్పించినట్టు మీడియాకు పంకజ్ వెల్లడించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారంటూ ముగ్గురు ఖాతాదారుల వివరాలను కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్-కు చెందిన ఏడుగురు మాజీ కేంద్ర మంత్రులకు స్విస్ బ్యాంక్-లో అకౌంట్లున్నాయని సుబ్రమణ్యస్వామి మరోమారు ధ్వజమెత్తారు. వందలాది మంది బ్లాక్-మనీ ఖాతాదారుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉందని మీడియాతో ఆయన అన్నారు. అయితే ఇది చాలా పెద్ద తొలి అడుగని సుప్రీంకోర్టులో కేంద్రం వాదిస్తోంది. అయితే విదేశాల్లో ఖాతాలు తెరవడం నేరమా అని ప్రదీప్ బర్మన్, పంకజ్ లోధా ప్రశ్నిస్తుండడం కొస మెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: