సమైక్యాంధ్ర రెండుగా విడిపోతే తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పవని.. సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. నెత్తీనోరూ బాదుకుని చెప్పాడు. ఆయన మాట అప్పట్లో తెలంగాణవాదులు పెద్గగా పట్టించుకోలేదు..కానీ ఇప్పుడు వాస్తవం కళ్లముందు కనిపించేసరికి.. ఔను కదా అని గుర్తుకుతెచ్చుకుంటున్నారు. మొదటి నుంచీ తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎక్కువ. ఉత్పత్తి.. తక్కువ. విద్యుత్ తోనే తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయం ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబులా.. తెలివిగా వ్యవహరించకుండా.. విద్యుత్ విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఇతర పార్టీల వారిని తన పార్టీలోకి లాక్కోవడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని విపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. మీరు ఎన్ననుకుంటే నాకేమనుకున్నారో ఏమో.. కేటీఆర్ సోమవారం మరోసారి నోటికి పనిచెప్పారు. అంబర్ పేటలో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యక్రమంలో ఆయన మరోసారి టీడీపీ, బీజేపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కాకుండా.. ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందే 86 సభల్లో తెలంగాణలో కరెంటు కష్టాలు తప్పవని కెసిఆర్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. బొగ్గు గనులు, నీరు ఉన్నా.. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల కరెంటు కష్టాలు వచ్చాయన్నారు. తట్టేడు బొగ్గు, నీరు లేని రాయలసీమకు 24 గంటలు కరెంటు సరఫరా అవుతోందని, దీనికి గత పాలకులే కారణమన్నారు. సమగ్ర ప్రణాళికతో నాలుగేళ్ళలో కచ్చితంగా కరెంటు సమస్యను అధిగమిస్తామన్న కేటీఆర్.. ఆ తర్వాత ఆంధ్రాకే కరెంటు అమ్మే స్థాయికి చేరుకుంటామని భరోసా ఇచ్చారు. మంచిదే... ఆ పౌరుషం మాటల్లో కాకుండా.. చేతల్లో ఉంటే తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: