బ్లాక్‌మనీ అంశంపై సుప్రీంకోర్టు మండిపాటు నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. విదేశాలలోని బ్లాక్‌మనీ భారతీయుల ఖాతాలను, ఖాతాదార్ల పేర్లను సుప్రీంకోర్టుకు ఎలాగూ బుధవారం సమర్పించుకుంటున్నామని మంగళవారం జైట్లీ విలేకరులకు తెలిపారు. అయితే జాబితాను సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనానికి అందచేస్తామని తెలియచేసిన జైట్లీ, జాబితాను బహిరంగపర్చి, ప్రజలకు తెలియచేసే వీలుందా? అనే అంశంపై దాటవేతకు దిగారు. పేర్లను సుప్రీంకోర్టుకు వెల్లడించిన తరువాత ప్రజలకు తెలియచేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాను ఇస్తున్నామని, అయినా ప్రభుత్వం ఏ దశలోనూ సమాచారం దాచిపెట్టడానికి యత్నించలేదని, పూర్తి దర్యాప్తు తరువాతనే బ్లాక్‌మనీ పూర్తి స్థాయి జాబితాను కోర్టుకు ఇవ్వడం మంచిదనుకున్నామని, ఎవరినీ రక్షించే యత్నాలకు దిగలేదని, అదే విధంగా ఈ అంశంతో ఇతరులను బ్లాక్‌మొయిల్‌ యత్నాలకు దిగడం లేదని ఆర్థిక మంత్రి జైట్లీ సుప్రీం ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించారు. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని బ్లాక్‌మనీ సిట్‌కు అందచేశామని , జూన్‌ 27నే ఈ సమాచారం అందించామని తెలిపిన జైట్లీ, చట్టాలకు అనుగుణంగానే బ్లాక్‌మనీ వ్యవహారంపై స్పందించాల్సి ఉంటుందని తెలిపారు. చట్టం, న్యాయం ప్రకారం బ్కానమనీ మూలాలపై ఆరాతీసేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. ఏది ఏమైనా బుధవారం సుప్రీంకోర్టుకు నల్లధనం ఖాతాదార్ల జాబితాను వెల్లడించడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తాము జాబితాను అందచేస్తున్నామని చెప్పిన జైట్లీ, అదీ సీల్డ్‌కవర్‌లో అని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: