రాష్ట్ర విభజనతో దారుణంగా దెబ్బతిని లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌లో పన్ను రాబడులు మెల్లిగా పెరుగుతున్నాయి. ఈ విషయం మంగళవారం సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయడు జరిపిన సమీక్షలో వెల్లడైంది. వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, అటవీ, రెవి న్యూ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గత ఏడాదికన్నా ఈసారి పన్ను రాబడులు పెరిగినట్లు అదికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 13 జిల్లాల ఆదాయం రూ. 11313 కోట్లుండగా ఇపుడు రూ. 12,881 వసలూ అయ్యింది. అంటే ఆదాయంలో రూ. 1368 కోట్లు పెరుగుదల నమోదైంది. వాణిజ్య పన్నుల్లో రాబడి గత ఏడాది మొదటి త్రైమాసికంలో రూ. 5858 కోట్లుండగా, ఈ ఏడాది రూ. 6207 కోట్లు వచ్చింది. గత ఏడాది రెండో క్వార్టర్లో రూ. 5454 కోట్లుండగా, ఈ ఏడాది రూ. 6673 కోట్లు వసూలైంది.ఆబ్కారీ శాఖ రెండు త్రైమాసికాలు కలిపి రూ. 1700 కోట్లు, రిజిస్ట్రేషన్లు శాఖ రూ. 1318 కోట్లు, రవాణాశాఖ రూ. 888 కోట్లు, గనులశాఖ రూ. 426 కోట్లు, రెవిన్యూశాఖ రూ. 94 కోట్లు, అటవీశాఖ రూ. 21 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాయి.  మొత్తం మీద రాష్ట్రంలో రెండో త్రైమాసానికి 17.6 శాతం రెవిన్యూ వృద్ది రేటు నమోదు చేసింది. ఆదాయ సముపార్జన విషయంలో మహారాష్ట్ర విధానాన్ని అనుసరించటం వల్లే ఆదాయం పెరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో తిరిగే అన్నీ వాహనాల్ని తనిఖీ చేయటానికి జిపిఎస్‌ ట్రాకింగ్‌ విదానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తడ-ఇచ్చాపురం మార్గంలో జిపిఎస్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని చంద్రాబాబు ఆదేశించారు. ఆబ్కారీ ఆదాయం విషయంతో పాటు కల్తీ మద్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణాశాఖ పనితీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో ఆబ్కారీ విధానాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడిలో బొగ్గు గనుల అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమీక్షలో రెవిన్యూ శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు పీవీ రమేష్‌, ఎస్పీ సింగ్‌, జెఎస్వీ ప్రసాద్‌, జెసీ శర్మ, ఎస్‌ఎస్‌ రావత్‌, అనిల్‌ పునేత తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: