రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. తెలంగాణను పునర్నిర్మించుకోవాల్సి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు చాలా ముఖ్యం. అందుకే బడ్జెట్ సమావేశాలను చాలా పకడ్బంధీగా నిర్వహించాలి.. సభ్యులందరికీ మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి. వారి సలహాలు సూచనలను తీసుకోవాలి... అని అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నవంబర్్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ అయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ అధికారులతోనూ, మంత్రులతోనూ సమీక్ష నిర్వహించాడు. సభలో వీలైనంత సేపు చర్చ జరగాలని... వివిధ అంశాలు చర్చకు రావాలని కేసీఆర్ కోరుకొంటున్నాడు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కేసీఆర్ చర్చించారు. సాయంత్రాలు కూడా సభను నిర్వహించడం... సభా సమయం వృథా కాకుండా చూసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అంటున్నారు. అలాగే పార్లమెంటు తీరున ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేసీఆర్ సూచిస్తున్నారు. అయితే ఇదంతా జరిగే పనేనా? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగే అవకాశం ఉందా? అనేవి మాత్రం సందేహాలే! ఎందుకంటే తెలంగాణలో ప్రతిపక్షాలు అధికార పక్షంపై కత్తిగట్టాయి. రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలు వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని ఆ పార్టీలు జనాల్లోకి వెళుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అసెంబ్లీ అవకాశాన్ని అవి వృథాగా పో నీయవు. ప్రభుత్వం పై దాడికే ప్రాధాన్యతను ఇస్తాయి. తాము చెప్పిన అంశాల గురించి చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల హోరు ఎలా ఉంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: