ఏపీ రాజకీయాలను ఒక ఊపుతాడనుకున్నయువకెరటం.. క్రమంగా నీరుకారిపోతున్నాడు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ సీఎం పదవిపై అతిగా ఆశలు పెట్టుకున్న జగన్.. అది దక్కకపోవడంతో విపరీతంగా నిరాశపడ్డారు. ఇప్పట్లో సీఎం సీట్లో కూర్చునే అవకాశం లేకపోవడంతో.. పార్టీపైనా అంతగా దృష్టిసారించడం లేదు. దీనికితోడు.. ఒక్కొక్కటిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. పార్టీ గ్రాఫ్ ను రోజురోజుకూ తగ్గిస్తున్నాయని చెప్పకతప్పదు. అధికారం దక్కినా.. దక్కకపోయినా.. పార్టీ ఎప్పుడ జనంలో ఉండాలి. పార్టీ నేతలు ప్రజాపోరాటాల్లో పాలుపంచుకోవాలి. అప్పుడే ఆ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. కానీ వైసీపీ తీరు చూస్తే.. ప్రజల తరపున సమస్యలపై పెద్దగా పోరాడుతున్నట్టు కనిపించడం లేదు. ఎన్నికలు ఉన్నప్పుడే సభలు, సమావేశాలు పెట్టడం రాజకీయం అనిపించుకోదు. కనీసం పార్టీని నమ్ముకుని వచ్చిన నేతలను కాపాడుకోవడంలోనూ విఫలమవుతున్నారు. దీంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఆ పరంపరలో భాగంగానే జూపూడి ప్రభాకర్ రావు, దినేష్ రెడ్డి, తాజాగా కొణతాల రామకృష్ణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు.. అక్రమాస్తుల కేసు జగన్ పార్టీని వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీకి ఫ్యూచర్ ఆశాజనకంగా లేకపోవడం వల్ల.. కేసుల భయంతోనూ.. నాయకులు వలసబాటపడుతున్నారు. ఈ వలసల పర్వం భవిష్యత్తులో మరింతగా ఉండే అవకాశం ఉంది. జగన్ క్రియాశీలకంగా మారి పార్టీని తక్షణం కాపాడుకునే ప్రయత్నాలు చేయకపోతే.. ఏపీలో సంచలనాలు సృష్టిస్తాడనుకున్న యువకెరటం.. కలలు కల్లలుగానే మిగిలే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: