నల్లధనం..నల్లధనం.. నల్లధనం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.. అవును మరి.. భారత దేశం ఓ గొప్ప ధనిక దేశం.. కానీ భారతీయులు అత్యంత పేదవాళ్లు.. ఈ వాక్యాలను అక్షరాలా నిజం చేస్తున్న అనేక అంశాల్లో ఈ నల్లధనం ఒకటి.. భారతీయుల రక్త మాంసాలు పిండి అడ్డదారుల్లో సంపాదించిన సంపద.. ఇక్కడ దాచుకుంటే.. ఎక్కడ బట్టబయలవుతుందోనన్న భయంతో.. విదేశాలకు తరలించారు. కనీసం ఆ లెక్కలేంటో కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు సుప్రీంకోర్టు పుణ్యమా అని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల పుణ్యమా అని ప్రజలకు ఆ వివరాలు చెప్పకతప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికి కొందరి పేర్లే బయటకు వచ్చినా.. సుప్రీం ఒత్తిడితో ఆ మిగిలిన పేర్లూ త్వరలోనే బయటకు వచ్చే మహత్తర అవకాశం లభించింది. ఐతే పేర్లు మాత్రమే బయటికొస్తే ఏం లాభం.. వారు దాచుకున్న సొమ్ము వివరాలు బయటకు రావాలి.. ఆ సొమ్ము భారత్ చేరాలి. ఇక్కడి ప్రజలకు చెందాలి.. ఇదీ భారతీయులు కోరుకునేది. మోడీ ఆ కలను నిజం చేస్తారో.. లేతో.. కొన్నాళ్లలోనే తేలిపోనుంది. ఇంతకీ అసలు విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఎంత.. ఈ ప్రశ్నలు అనేక సమాధానాలున్నాయి. కానీ వాటిలో ఏది సరైందో ఎవరూ చెప్పే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఈ సంపద విలువ..అక్షరాలా 28 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని మూడేళ్ల క్రితం బీజేపీ సీనియర్ నేత అద్వానీ ప్రకటించారు. గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటెగ్రిటీ అనే అమెరికన్ సంస్థ పరిశోధనలో ఇది వెల్లడైందని ఆయన అప్పట్లో చెప్పారు. అదే ఏడాది బీజేపీ చెప్పిన అంచనాల ప్రకారం.. రూ.30లక్షల కోట్ల నుంచి 84 లక్షల కోట్ల వరకూ ఉంటుందట. రెండేళ్ల క్రితం ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో ఈ మొత్తం కేవలం 12వేల కోట్లు మాత్రమేనని తెలిపింది. 8 ఏళ్ల క్రితం స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ నివేదిక పేరుతో వెల్లడైన సమాచారం ప్రకారం ఈ నల్లధనం.. 87 లక్షల కోట్లట. తాజాగా ఈ ఏడాది గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ మొత్తం.. 20 లక్షల కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: