రాష్ట్రవిభజన తర్వాత నెల్లూరు జిల్లా క్రమంగా అభివృద్దిపథంలో అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి కృష్ణపట్నం పోర్టు అందుబాటులోకి వచ్చాక.. పోర్టు ఆధారంగా అనేక పరిశ్రమలు నెల్లూరు జిల్లాకు వస్తున్నాయి. కృష్ణపట్నం సమీపంలో ఉన్న ఏపీ జెన్కో థర్మల్‌ కేంద్రం, ప్రైవేటు ధర్మల్‌ కేంద్రాల్లో విద్యుద్‌ ఉత్పత్తి ప్రారంభమవడం వల్ల పరిశ్రమలకు విద్యుత్తు లభ్యం కావడం కూడా ఈ జిల్లాకు ఓ ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పటికే అనేక కంపెనీలు ఇక్కడ పరిశ్రమలను స్థాపిస్తామని ముందుకొచ్చాయి. తాజాగా... ఎరువుల తయారీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న క్రిభ్ కో సంస్థ.. నెల్లూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు కోసం వేగంగా పనులు చేస్తోంది. కృష్ణపట్నం ఓడరేవు సమీపంలోని సర్వేపల్లి వద్ద పరిశ్రమను నిర్మించేందుకు క్రిభ్‌ కో సంస్థ సన్నాహాలు చేస్తోంది. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో 300 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఎరువుల పరిశ్రమతో 2వేల మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడ ఇప్పటికే 120 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగిలిన స్థలాన్ని కూడా త్వరలోనే సేకరించి పరిశ్రమ పనులు ప్రారంభించనున్నారు. ఇక్కడ యూరియా, డీఏపీ వంటి ఎరువులు తయారుచేస్తారు. నెల్లూరు జిల్లాలో ఏడాదికి పదిన్నర లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ చేయాలన్నది క్రిబ్ కో నిర్ణయించుకున్న లక్ష్యం. ఈ ఫ్యాక్టరీని రెండు దశల్లో స్థాపిస్తారు. మొదట 700 కోట్లతో ప్రారంభించి.. మలి దశలో మరో 300కోట్ల రూపాయలతో విస్తరించనున్నారు. వచ్చే రెండేళ్ళలో కర్మాగారం పూర్తి చేసి.. ఉత్పత్తి ప్రారంభించాలన్నది డెడ్ లైన్. కృష్ణపట్నం ఓడరేవు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రతిపాదిత ఎరువుల కర్మాగారం రూపొందనుంది. ముడి సరుకుల దిగుమతి, ఎరువుల రవాణాకు... ఓడరేవు అనువుగా ఉందని గుర్తించి.. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు క్రిభ్‌కో సన్నద్ధత తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: