ఎమ్మెల్యేలకు దర్జాగా హైదరాబాద్ లో క్వార్టర్లుంటాయి. అది కూడా భాగ్యనగరంలోని మాంచి పోష్ ఏరియాలో అని అంతా అనుకుంటారు కానీ.. ఏపీ ఎమ్మెల్యేల గూడు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. శాశనసభల పని మీద కానీ.. ఇంకా వేరే ఏ పనిపైనైనా హైదరాబాద్ వస్తే.. పాపం చుట్టాలిళ్లలోనో... హోటళ్లలోనే సర్దుకు పోవాల్సిందే. అదేంటి మరి ఎమ్మెల్యే క్వార్టర్లున్నాయిగా అంటారా.. ఉన్నాయి నిజమే కానీ.. అవి ఖాళీగా ఉండాలి కదా.. పోయన సారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ క్వార్టర్లలో ఉన్నవాళ్లు ఖాళీ చేయాలి కదా.. ఔను మరి.. సర్కారు మారి.. ఐదు నెలలు కావస్తున్నా.. పాత ఎమ్మెల్యేలు ఇంకా క్వార్టర్లు ఖాళీ చేయలేదు. కొత్త ఎమ్మెల్యేలకు నిలువ నీడ లేదు. అదేమని గట్టిగా అందామంటే..అదిగో.. ఇదిగో.. మంచిరోజు.. ఆషాడం.. కార్తీకం అంటూ కబుర్లు చెబుతున్నారే తప్ప ఖాళీ చేయడం లేదు. దీంతో ఇక లాభంలేదనుకున్న నిర్వాహక కమిటీ.. ఘాటుగా మాజీ ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ చేసింది. మర్యాదగా నవంబర్ 12లోపు ఖాళీ చేస్తారా సరే సరి.. లేదంటే.. ఇళ్లకు విద్యుత్, నీరు అన్నీ బంద్ చేస్తామని హుకుంజారీ చేశారు. పాత ఎమ్మెల్యేలను ఖాళీ చేయించే విషయంపై చాలాసార్లు కమిటీ సమావేశాలు జరిగాయి కానీ ఫలితం దక్కలేదు. 134 నివాసాల్లో కేవలం 12మాత్రమే ఖాళీ అయ్యాయి. ఈ సమస్య కొత్తదేం కాదు.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా..ఇదిగో ఇలా ఎమ్మెల్యేలకు క్వార్టర్ల కేటాయింపు విషయంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మరి ఈ నవంబర్ 12కైనా పాత ఎమ్మెల్యేలు ఖాళీ చేస్తారా.. మళ్లీ పాత కథలనే కొత్తగా తిప్పి చెప్పి.. ముప్పుతిప్పలు పెడతారా.. వెయిట్ అండ్ సీ..

మరింత సమాచారం తెలుసుకోండి: