మహారాష్ట్రలో కొత్త సమీకరణలకు తెర లేచింది. ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులేస్తోంది. శుక్రవారం దేవేందర్‌ ఫడ్నవిస్‌ నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేయనున్నది. ఎన్డీయే భాగస్వామపక్ష మైన శివసేనకు మహారాష్ట్ర ప్రభుత్వంలో చోటు లేదని బీజేపీ సంకేతాలు ఇచ్చింది. ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయ నున్నారని బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రాజీవ్‌ ప్రతాప్‌రూఢీ గురు వారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇందులో శివ సేనకు సంబంధించిన వారెవరూ లేరని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము బయట నుంచి మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మద్దతుపై బీజేపీ అధినాయకత్వం బాహాటంగా స్పందించలేదు అయితే మిత్రపక్షం శివసేనను ప్రసన్నం చేసుకోవడానికే బీజేపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే శివసేన, బీజేపీ మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. అసెంబ్లి  ఎన్నికలలో సీట్ల సంఖ్య మధ్య వచ్చిన భేదాభిప్రాయాలతో కూటమి నుంచి వైదొలగి అటు బీజేపీ ఇటు శివసేన ఒంటరిగానే బరిలోకి దిగి తమ సత్తా చాటుకున్నాయి. 119 స్థానాలకు మించి బీజేపీకి ఒక్క స్థానం కూడా ఇచ్చేది లేదని అప్పటి వరకూ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న శివసేన తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమి లేక బీజేపీ, ఆర్‌పీఎఫ్‌ లాంటి చిన్న పార్టీలతో జతకట్టి అసెంబ్లిd ఎన్నికల బరిలోకి దిగింది. 123 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. ఒంటరిగా పోటీ చేసిన శివసేన 67 స్థానాలు కైవసం చేసుకుంది. అటు కాంగ్రెస్‌, ఎన్సీపీలు కూడా ఒంటరిగానే పోటీ చేసి కాంగ్రెస్‌ 43 స్థానాల్లో, ఎన్సీపీ 42 స్థానాల్లో గెలుపొందింది. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ సాధించలేకపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ ఇచ్చిన ఆఫర్‌ను కాదనలేదు. ఇటు పాతమిత్ర పక్షం శివసేనను దూరంగా ఉంచలేని పరిస్థితి. బీజేపీ మాత్రం స్వతంత్రుల మద్దతుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. శుక్రవారం ఫడ్నవిస్‌ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. అటు ఎన్డీయేలో ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చిన శివసేనకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. దశాబ్ద కాలం అనంతరం కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వంలో శివసేనకు తగిన ప్రాతినిథ్యం కల్పించలేదని ఆ పార్టీ అధినాయకత్వం గుర్రుగా ఉంది. అంతేగాక మహారాష్ట్ర అసెంబ్లిd ఎన్నికల్లో తమను కాదని ఒంటరిగా బరిలోకి దిగడం కూడా శివసేనకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. అసెంబ్లిd ఎన్నికల ప్రచారంలో బీజేపీ పైనా, ప్రధానంగా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి స్నేహహస్తం సంకేతాలిచ్చినా... స్పందన లేదని శివసేన నాయకత్వం భావిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంలో తాము భాగస్వాములు కావాలని భావించినా... బీజేపీ నుంచి సంకేతాలు రాలేదు. ఇక వేచిచూడడం మంచిది కాదు, ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: