రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రోజుకి కనీసం ముగ్గురు చొప్పున ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతే 350 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో అత్యధికులు చిన్న, సన్నకారు, కౌలు రైతులే. ఈ దుస్థితికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులెవరు? ఈ ఆత్మహత్యలను నివారించాలంటే ఏం చేయాలి? కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు వుండవచ్చునేమో కానీ అన్నదాత చావులకు మాత్రం ప్రభుత్వ విధానమే ఏకైక కారణం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మారినా రైతుల పట్ల విధానం మారడం లేదు. అందుకే ఆత్మహత్యలు ఆగడం లేదు. అవను. అన్నదాత అంటే అందరికీ చిన్నచూపే. రైతన్న జీవితంతో అంతా ఆటలాడుకునేవారే. ఎవరి నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లాలన్నా, తృప్తిగా కడుపునిండా భోజనం చేయాలన్నా అన్నదాత చమటచుక్కలతో పుడమితల్లి తడవాలి. ఇంటిల్లిపాది రక్తమాంసాలతో పంట ఏపుగా పెరగాలి. కానీ, అన్నదాత మాత్రం అందరికీ పరాయివాడై పోతున్నాడు. రైతుల పట్ల న్యాయంగా వ్యవహరించేవారు ఒక్కరూ కనిపించడం లేదు. భూమిలో చల్లిన విత్తనం పైరుగా మారి, పంట చేతికొచ్చే దాకా అది అసలో నకిలీయో అర్ధం కాదు.  ఈ మధ్యలో చల్లే ఎరువులు, పురుగు మందులు పనిచేస్తాయో లేదో తెలియదు. ఆ మాటకొస్తే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో దొరకడమే దుర్లభం. వీటి కోసం ఎన్ని రోజులు చెప్పులరిగేలా తిరగాలో? ఎన్ని లాఠీ దెబ్బలు తినాలో? క్యూ లైన్లలో ఎంతమంది ప్రాణాలు విడవాలో? ఈ దేశంలో ఏ ఉత్పత్తిదారుడికీ లేని బాధలు, కష్టాలు, శాపాలు రైతుకెందుకు? అదృష్టవశాత్తు అన్నీ సకాలంలో మంచివే దొరికినా చివరకు మార్కెట్లో ధర లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రకృతి ఎప్పుడో ఒకసారి రైతన్నను అపహాస్యం చేస్తుంది. కానీ మార్కెట్ శక్తులూ, ప్రభుత్వాలు అన్నదాతతో పరిహాసమాడని రోజంటూ వుండదు. విత్తనాల కంపెనీలు మాయ చేసినా ప్రభుత్వం పట్టించుకోదు. ఎరువులు బ్లాక్ మార్కెట్ లోకి తరలిపోతున్నా స్పందిచదు. మార్కెట్లో దళారీలు చెలరేగిపోతున్నా చేష్టలుడిగి చూస్తూ కూర్చుంటుంది. వ్యవసాయ రుణాల విషయంలో బ్యాంక్ నిబంధనలు సరళతరం చేయదు. రైతులకు రుణాలివ్వాలని ఏ ఒక్కరోజూ గట్టిగా చెప్పదు. రుణమాఫీలు, సబ్సిడీలు లాంటి విషయాల్లో తాను ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయదు. బోరుబావుల కింద, పంపుసెట్ల కింద సాగుచేస్తున్న రైతులకు పొలం తడపడానికి అవసరమైనంత కరెంట్ ఏ ఒక్కరోజూ ఇవ్వరు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరచరు. లో ఓల్టేజీలతో మోటార్లు కాలిపోతున్నా, ట్రాన్స్ ఫార్మర్లు పాడైపోయినా మరమ్మతులు చేయించరు. ప్రకృతిని ఎదిరించి, భగీరథ ప్రయత్నాలు చేసి, మార్కెట్ శక్తులు చేసే పరిహాసాలను భరాయిస్తూ, రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను మార్కెట్ వెక్కిరిస్తే, పరిస్థితులు అనుకూలించేవరకు వాటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా ఎలాంటి సౌకర్యాలూ ప్రభుత్వం కల్పించదు. మార్కెట్ శక్తులను నియంత్రించి, బ్యాంకింగ్ వ్యవస్థను రైతు ముంగిట్లో నిలిపి, విద్యుత్, నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచి, మార్కెట్ సౌకర్యాలు, గోదాము సౌకర్యాలు విస్తరింపచేసి అండగా నిలవాల్సిన ప్రభుత్వమే ఇన్ని రకాల నిర్లక్ష్యాలు ప్రదర్శిస్తుంటే ఇక అన్నదాతకు దిక్కెవరు? వ్యవసాయరంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడమే ఇంతమంది రైతుల ఆత్మహత్యలకు కారణం. విత్తనాలు కొనుక్కునే దశ నుంచి, తాను పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునే దాకా సాగే వివిధ దశల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలిస్తే ఆత్మహత్య చేసుకోవాల్సిన దౌర్భాగ్యం అన్నదాతకు ఏర్పడుతుందా? ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుపాన్ లు, వర్షాభావ పరిస్థితులు, గాలి దుమారాలు ప్రతి ఏటా రైతులకు నష్టం చేస్తున్న మాట నిజమే అయినా నేటి అన్నదాత దుస్థితికి పూర్తిగా వాటినే నిందించలేం. కనీసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అన్నదాతకు అండగా నిలవాలన్న కనీస స్పృహ ప్రభుత్వాల్లో లోపిస్తోంది. గడిచిన 20 ఏళ్లలో తెలంగాణలో 30 వేల మంది, మన దేశంలో మూడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వాల నుంచి కనీస మానవీయ స్పందన వ్యక్తం కాకపోవడమే అసలైన విషాదం.

మరింత సమాచారం తెలుసుకోండి: