1984 అక్టోబర్ 31 ఉదయం నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శరీరం బాడీగార్డుల తుపాకీ గుళ్లకు జల్లెడగా మారిన వార్త యావత్భారతాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం యావత్తూ కన్నీటి సంద్రమైంది. ఆ వార్త కొందరిలో ఆవేదనకు గురిచేస్తే.. మరికొందరిలో ఆవేశాన్ని పురికొల్పింది. వారు ఇందిరను బలితీసుకున్న బాడీగార్డుల మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఊచకోతకు ప్రణాళికలు రచించారు. ముఖ్యంగా ఢిల్లీలోని సిక్కు మతస్తులు ఎక్కువగా నివసించే ప్రాంతాలను గుర్తించారు. అందుకు ఓటర్ లిస్ట్‌లను వాడుకున్నారు. నవంబర్ 1 నుంచి 3 రోజుల పాటు కనీవినీ ఎరుగని దారుణానికి తెగించారు. సిక్కుల మానప్రాణాలు, వారి ఆస్తులే లక్ష్యంగా దాడులు చేశారు. ఇందిరాగాంధీ మరణంపై లండన్‌లోని సిక్కులు ఉత్సవాలు చేసుకున్నారన్న వార్త, పత్రికల్లో ప్రచురితమైన ఆ ఫోటోలు వారి ఆవేశాన్ని మరింత పెంచాయి. ‘మారో సర్దారోంకో’ అంటూ ఢిల్లీ వీధుల్లో మృత్యు కవాతు చేశారు. సిక్కులు కనిపిస్తే.. స్త్రీ, పురుష.. చిన్నాపెద్దా తేడా లేకుండా వెంటాడి మరీ హతమార్చారు. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రి మార్చురీ సిక్కు మృతదేహాల గుట్టలతో నిండిపోయిందని ఆ దురాగతాల్ని మొట్టమొదట ప్రపంచానికి వెల్లడించిన యూఎన్‌ఐ జర్నలిస్ట్‌లు తెలిపారు. ఆ దారుణాలకు ఆ మూడు రోజుల్లోనే 3 వేల మందికి పైగా సిక్కులు బలయ్యారు. జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇందులో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. ‘పై’ నుంచి వచ్చిన ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు ఈ దారుణాలను చూస్తూ ఉండిపోయారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వచ్చిన ఆర్మీకి సైతం సహకరించలేదు. ఈ దారుణాలను ఇందిరాగాంధీ తనయుడు, ఆమె తదనంతరం ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌గాంధీ తేలిగ్గా తీసుకున్నారు. ‘ఒక మహావృక్షం కూలినప్పుడు దాని కింది భూమి కంపించడం సహజమే’ అని వ్యాఖ్యానించారు. 2005లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ 1984 ఊచకోతపై సిక్కులకు క్షమాపణలు చెప్పారు. కమిటీలపై కమిటీలు... ------------------------- ఆనాటి నుంచి ఈ అల్లర్లపై నిజనిర్ధారణకు ప్రభుత్వం లెక్కకు మించిన కమిటీలను, కమిషన్లను నియమించింది. 1984, నవంబర్‌లో ఏర్పాటు చేసిన మార్వా కమిషన్(అదనపు పోలీస్ కమిషనర్ వేద్ మార్వా నేతృత్వంలో పోలీసుల పాత్రపై విచారణ ప్రారంభించి, ప్రభుత్వ ఆదేశాలపై మధ్యలోనే ఆపేసింది), మిశ్రా కమిషన్(సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో 1985లో ఏర్పాటైంది) నుంచి ప్రారంభించి ఇటీవలి నానావతి కమిషన్ వరకు 10 కమిటీలు, కమిషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం --------------------------------- ఇందిరాగాంధీ హత్య జరిగి నేటికి 30 ఏళ్లు. సిక్కులపై జరిగిన దారుణాలకూ దాదాపు అదే వయసు. అయితే, ఇప్పటికీ ఆ ఊచకోత బాధితులు, వారి బంధువులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. న్యాయమైన పరిహారం కోరుతూ న్యాయస్థానం తలుపులు తడుతూనే ఉన్నారు. ‘నిందితులకు కఠినశిక్ష, బాధితులకు సరైన పరిహారం అందేవరకూ మా పోరాటం ఆపబోం. న్యాయానిదే తుది విజయమని నిరూపిస్తాం’ అని బాధితుల తరఫున అలుపెరగని పోరాటం చేస్తున్న సీనియర్ న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా(ఈయననూ 1984 అల్లర్ల సమయంలో దుండగులు మారణాయుధాలతో వెంటబడి తరిమారు) తేల్చి చెబుతున్నారు. నిందితులను కాపాడేందుకు, కేసును నీరుగార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని ఆయన విమర్శించారు. 3 వేల మందికి పైగా సిక్కులు బలైన ఊచకోతలో ఇప్పటివరకు కేవలం 30 మంది, అదీ కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే శిక్షపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: