శ్రీలంకలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి సుమారు 200 మంది సజీవ సమాధి అయ్యారు. వీరిలో అత్యధికులు భారత సంతతికి చెందిన ప్లాంటేషన్ కార్మికులు ఉన్నారు. సెంట్రల్ బాడుల్లా జిల్లాలోని మీరియబెడ్డ టీ ఎస్టేట్‌లో నిన్న ఈ దుర్ఘటన సంభవించింది. భారీగా కొండ చరియలు విరిగి పడటంతో 120 మంది కార్మికులకు చెందిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 192 మంది గల్లంతు అయినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కొడిప్పిలి తెలిపారు. కొండ చరియల కింద సమాధి అయిన వారిని రక్షించేందుకు గురువారం పెద్ద ఎత్తున సహాయక చర్యలను చేపట్టారు. శ్రీలంక ఆర్మీ కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయింది. కొండ చరియలు విరిగిపడటం వల్ల నిరాశ్రయులయిన 817 మందిని అంపిటికాండ, కోస్‌లాండలో ఏర్పాటు చేసిన రెండు సహాయక శిబిరాలకు తరలించినట్లు ప్రదీప్ తెలిపారు. కొండ చరియల కింద సజీవ సమాధి అయిన వారు బతికి ఉండే అవకాశాలు చాలా స్వల్పమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ వారిని రక్షించడానికి నేషనల్ బిల్డింగ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌బిఆర్‌ఓ)కు చెందిన అయిదు బృందాలతో పాటు సైనిక, పోలీసు సిబ్బంది ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సమాధి అయిన బాధితులను ప్రాణాలతో బయటికి తీసుకు రావడానికి శ్రీలంక ఆర్మీ భద్రతా బలగాల ప్రధాన కార్యాలయం నుంచి 500 మందికి పైగా సైనికులను సహాయక చర్యలకు తరలించింది. ఈ సైనికులతో పాటు శ్రీలంక వైమానిక దళ సిబ్బంది, పోలీసులు, ఆరోగ్య బృందాలు, సహాయక బృందాలు ప్రస్తుతం కొండ చరియల కింద సమాధి అయిన బాధితుల కోసం గాలిస్తున్నాయి. ఈ రోజు ఉదయం సహాయక చర్యలను తిరిగి ప్రారంభించగానే కొండ చరియలను తొలగించడానికి అయిదు భారీ డిగ్గింగ్ యంత్రాలను సంఘటన స్థలానికి రప్పించారు. అయిదు వందల మందికి పైగా సైనిక సిబ్బంది ఇప్పటికే గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని, అదనంగా మరో 200 మంది సైనికులను రంగంలోకి దింపడానికి చర్యలు తీసుకున్నామని రీజియన్ ఉన్నత మిలిటరీ అధికారి మేజర్ జనరల్ మానో పెరెరా విలేఖరులకు చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందని ఆయన తెలిపారు. పైగా ఈ వర్షాల వల్ల చుట్టుపక్కల ఉన్న కొండలపై నుంచి కూడా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. (చిత్రం) బురద కింద మృతదేహాలను వెతుక్కుంటున్న బంధువుల కుటుంబాలు

మరింత సమాచారం తెలుసుకోండి: