మంజీర పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం గతంలో ఎన్నడు లేని విధంగా జంట నగారాల ప్రజల తాగునీటిపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం పుల్కల్ మండలం సింగూర్ గ్రామ శివారులో భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. దీని పూర్తిస్థాయి సామర్థ్యం 29.99 టిసిఎంల నీటి నిల్వతో నిర్మింపజేసారు. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటితో పాటు ఈ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే ప్రతి యేటా మంజీర బ్యారేజ్, ఘణాపూర్ ప్రాజెక్టు, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులకు 8 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ యేడాది మంజీర నదికి ఎగువ ప్రాంతాలైన కర్నాటక, మహారాష్టల్ల్రో ఆశించిన వర్షాలు కురియలేదు. ఫలితంగా గడచిన వర్షాకాలంలో కేవలం 2 టిఎంసిల నీరు మాత్రమే సింగూర్ ప్రాజెక్టుకు నీరు వచ్చింది. ప్రస్తుత నీటి మట్టం 12.8 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురిస్తేగానీ సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ మెరుగుపడే అవకాశం. వర్షాలు కురియకపోయినా నిరంతరాయంగా హైదరాబాద్‌కు మెట్రోవాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తోంది. ప్రతి రోజు 127 క్యూసెక్కుల నీటిని మహానగర ప్రజల దాహర్తి తీర్చేందుకు సరఫరా చేస్తున్నారు. మరో వంద క్యూసెక్కుల నీరు ఎండ ప్రభావంతో ఆవిరైపోతూ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పది టిఎంసిల నీటి నిల్వకు పడిపోగానే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తామని మెట్రోవాటర్ వర్క్స్ డిఇ జగన్నాథం పేర్కొన్నారు. 5 టిఎంసిల సామర్థ్యంకు చేరుకునే వరకు నీటిని సరఫరా చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేసారు. సింగూర్ ప్రాజెక్టుకంటే ముందుగానే సంగారెడ్డి మండలం కల్పగూర్ గ్రామ శివారులో మంజీర నదిపై 1.5 టిఎంసిల నీటి సామర్థ్యంతో మంజీర బ్యారేజ్‌ను నిర్మించి హైదరాబాద్‌కు నీటి సరఫరా చేస్తున్నారు. మంజీర బ్యారేజ్‌లో 0.34 టిఎంసిల నీరు మాత్రమే నిల్వఉంది. రబీలో ఘణాపూర్ ఆనకట్ట కింద సాగు అవుతున్న వరి పంట పరిరక్షణకు సింగూర్ నుంచి దపాలవారిగా 0.25 టిసింల నీటిని విడుదల చేసే క్రమంలో మంజీర బ్యారేజ్‌లో నీటి పరిస్థితి మెరుగుపడేది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈసారి రబీ సాగు నిలిచిపోనుండగా, సింగూర్‌లో నీటి మట్టం తగ్గిపోవడంతో దిగువకు నీటిని ఎంత మాత్రం విడుదల చేసే అవకాశాలు లేవు. దీంతో మంజీర మొత్తం వట్టిపోవడం ఖాయమే అని చెప్పవచ్చు. మాఘం అమావాస్య, మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని పాపన్నపేట మండలం నాగ్‌సాన్‌పల్లి గ్రామ శివారులో వెలసి లక్షలాది మంది భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఏడుపాయల వనదుర్గా ఆలయ జాతర వేడుకలకు సైతం నీటి గండాలు తప్పవని చెప్పవచ్చు. మహాశివరాత్రి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలిరానుండగా మంజీరలో నీరు లేకపోవడంతో తాగునీటితో పాటు ఇతర అవసారాలకు నీటి లభ్యత ప్రశ్నార్థకం కానుంది. గతంలో ఎన్నడు లేని విధంగా జిల్లాలోని జలాశయాలన్ని నీరు లేక వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి. వరుణుడు కరుణిస్తేకానీ సింగూర్, మంజీర, ఘనాపూర్ జలాశయాల పరిస్థితి మెరుగుపడే స్థితిలో కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: