తెలుగు దేశం ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి అక్రమ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తోందని పిసిసి రఘువీరారెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలో త్వరలో చేపట్టే ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాట కార్యక్రమాన్ని రూపొందించేందుకు మాజీ కేంద్ర మంత్రి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి స్వగ్రామం లద్దగిరికి వచ్చారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సూజాతమ్మ రఘువీరారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామ ప్రజలు లద్దగిరికి చేరుకుని సమస్యలు రఘువీరారెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా పింఛన్లు, రేషన్ కార్డుల ఏరివేత, రైతుల రుణమాఫీ చేయలేదని రఘువీరా దృష్టికి తెచ్చారు.  అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఎనిమిది నెలల్లో రాష్ట్ర అభివృద్ధిని టిడిపి గాలికి వదిలేసిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా టిడిపి నేతలకు అక్రమ సంపాదనకు చూపుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు. టిడిపి పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక నియోజక కేంద్రంలో ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాటను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల సమక్షంలో ఎండగట్టుతామన్నారు. ఈయన వెంట జిల్లా కాంగ్రెస్ నేతలు చెరుకల పాడు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: