మెట్రో పనులపై ఆ మధ్య నెలకొన్న వివాదాల మాటేమోగానీ.. ప్రస్తుతం భాగ్యనగరంలో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఉగాది నాటికి మెట్రో సర్వీసులను అందుబాటులో తేవాలన్న లక్ష్యాన్ని అందుకోవడమే పనిగా పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇప్పటికే నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు పూర్తైన రైలుమార్గంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నెల క్రితం ఓసారి కొద్ది దూరం ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు.. మంగళవారం మరోసారి ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్గంలో దాదాపు లైన్ అంతా క్లియర్ అయినట్టే.. ఇక ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట మీదుగా ఎర్రగడ్డ వరకు ప్రధాన మార్గంలో... పిల్లర్లు, రైల్వే ట్రాక్, మెట్రో స్టేషన్లు, వాటికి అనుబంధంగా ఉండే వాణిజ్య సముదాయాల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఎర్రమంజిల్, అమీర్ పేట్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మెట్రో రైలు నిర్మాణ పనులు నిరంతరం సాగుతున్నాయి. మూడు షిప్టుల్లో 24 గంటలపాటు పనులు కొనసాగుతున్నాయి. నగరంలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతం కావడంతో రహదారిపై నిర్మించే పిల్లర్లు, ట్రాక్ స్లాబ్స్ అమరిక వంటి పనులను రాత్రి వేళ్లల్లో ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఐతే కీలకమైన అసెంబ్లీ ప్రాంతంలోని పనులు మాత్రం ఎప్పటిలాగానే నత్తనడకన నడుస్తున్నాయి. ఇక్కడ అలైన్ మెంట్ మారుస్తారా.. పాత మార్గంలోనే కొనసాగిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రానందువల్ల.. ఇక్కడ పనుల్లో చెప్పుకోదగిన పురోగతి కనిపించడం లేదు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో... రహదారిపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, రోడ్లను మూసేస్తున్నారు. రోడ్డుకు ఒకవైపునే ఎదురెదురుగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్ని వేగంగా నిర్వహించేందుకు భారీ క్రేన్లు, బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లు, మిక్సింగ్ యంత్రాలు, నిరంతరం విద్యుత్ సరఫరా యూనిట్లను వినియోగిస్తున్నారు. రాత్రివేళల్లో కూడా కార్మికులు కంటిపై రెప్పవాల్చకుండా శ్రమిస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే.. అనుకున్న గడువులోగా భాగ్యనగరంలో మెట్రో పరుగులు ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: