హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మూత పడనుంది. పార్టీ కార్యాలయం నిర్వహణ వ్యయం భారీగా పెరగడం వల్ల వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో కార్యాలయాన్ని లీజు ప్రాతిపదికన తీసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. సాధారణ ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి రాలేదు. మరోవైపు.. పార్టీ కార్యాలయ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇవన్నీ పరిగణించిన మీదట ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోటస్ పాండ్ లోని తన నివాసంలో కొంత భాగాన్ని పార్టీ కార్యాలయంగా మార్చాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ కార్యాలయం లోని ఫర్నీచర్ సహా ఇతర వస్తువులను తరలించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకున్న తర్వాత ఇక్కడ కార్యకలాపాలు నిలిపి వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైకాపా ఆవిర్భావం నుంచి 3 ఏళ్లపాటు రోడ్ నెంబర్ 45 లో పార్టీ కార్యాలయం కొనసాగింది. రోడ్ నెంబర్ 45 సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం మూసివేతపై ఎంతవరకూ నిజమో గానీ.. ఓ వింత ప్రచారం వినిపిస్తోంది. రోడ్ నెంబర్ 45 ప్రాంతం కొత్త పార్టీలకు ఐరన్ లెగ్ లాంటిదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే మార్గంలో ప్రజారాజ్యం పార్టీ, మరికొన్ని మీడియా సంస్థలు ప్రారంభమయ్యాయి. ప్రజారాజ్యం జెండా పీకేశారు. ఈ మార్గంలో పెట్టిన టీవీ ఛానళ్లు కూడా చాలావరకూ దివాలా తీయడం ఎత్తేయడం జరగడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: