వారు ఐఏఎస్ స్థాయి అధికారులు.. 20 ఏళ్ల నుంచి నిన్న మొన్నటి వరకూ కలసి మెలసి పని చేసిన వారే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారింది. ఎక్కడ పనిచేస్తే ఆ రాష్ట్రం తరపున వాదనలు తయారు చేసుకుంటున్నారు. మొన్నటిదాకా నవ్వుతూ మాట్లాడుకున్న తోటి అధికారులతోనే ఇప్పుడు వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి. ఆదివారం జరిగిన కృష్ణపట్నం పాలక మండలి సమావేశమే ఇందుకు ఓ ఉదాహరణ. హైదరాబాద్‌లోని జెన్‌కో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ డిస్కంల తరఫున పాల్గొన్న సీఎండీలు 4 అంశాలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులతో వాదానికి దిగారు. కృష్ణపట్నం విద్యుత్‌ కేంద్రంలో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారని తెలంగాణ అధికారులు ఏపీ అధికారులను నిలదీశారు. గతంలోఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు పూర్తయి, 6 నెలలు గడచినప్పటికీ... వాణిజ్య ఉత్పత్తి ఎందుకు ప్రారంభించడంలేదని ప్రశ్నించారు. ఎజెండాలోని అన్నిఅంశాలపై లిఖితపూర్వకంగా సమావేశంలో అభ్యంతరాలు తెలిపారు. కృష్ణపట్నంలో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల వాటాలు 57శాతం ఉన్నాయని గుర్తుచేశారు. అసలు తెలంగాణకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉత్పత్తిని ప్రారంభించడం లేదని.. ఇది అన్యాయం, అనైతికమని వాదించారు. తెలంగాణ వాదనలను ముందే ఊహించిన ఏపీ అధికారులు అందుకు దీటైన సమాధానాలు ఇచ్చారు. సాంకేతిక సమస్యల కారణంగానే కృష్ణపట్నంలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించలేదని చెప్పారు. తాము చెబుతున్న అంశంపై అనుమానాలుంటే.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంజనీర్లను పంపించి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. విద్యుత్‌లో తమకు వాటా ఇవ్వాలని తెలంగాణ పంపిణీ సంస్థలు కోరగా, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తెలిపారు. ఇలా ప్రతి విషయంలోనూ తెలంగాణ అధికారులకు ఎక్కడా దొరక్కుండా వివరణలు ఇవ్వడంతో.. సమావేశం ఎలాంటి కన్ క్లూజన్ లేకుండానే ముగిసింది...

మరింత సమాచారం తెలుసుకోండి: