రాజధాని కోసం భూముల వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ కూడా ఏపీ ప్రభుత్వానికి, ఏపీ ముఖ్యమంత్రికి హెచ్చరికలు జారీ చేసింది. ఇష్టాను సారం భూములను సేకరిస్తామంటే సహించేది లేదని.. రైతుల సమ్మతితోనే భూములను తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ అంటోంది. ఈ విషయంలో ఒంటెత్తు పోకడతో ముందుకు వెళతామంటే కుదరదని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం స్పష్టం చేసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూమిని సేకరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ముప్పైవేల ఎకరాల భూమిని సేకరించాలని ఏపీ ప్రభుత్వం అనుకొంటోంది. ఈ మేరకు భూ సేకరణ గురించి రైతుల్లో అవగాహన నింపుతామని ప్రకటన చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పల్లెలకు అధికారులను పంపించి వారికి చావు కబురు చల్లగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం అధికారులకు ఎర్రజెండాలను చూపుతున్నారు. పంటలు పండే భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసే ప్రసక్తే లేదని... వారు అంటున్నారు. ప్రభుత్వ విధానాలతో తమకు సంబంధం లేదని.. తమ ఉపాధి మార్గాన్ని వదులుకోలేమని, అన్నదాతకు చేటు చేయవస్తే.. మట్టి గొట్టుకుపోతారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలు రైతులకు మద్దతును పలుకుతున్నాయి. మీడియా సరిగా కవర్ చేయడం లేదు కానీ... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు ఇప్పడు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలోని భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ కూడా రైతులకే మద్దతు ప్రకటించింది. బలవంతంగా భూ సేకరణ చేయాలని చూస్తే సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: