తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ లోకి మోటార్ బైక్ తో ఇద్దరు యువకులు దూసుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ పర్యటన నుంచి తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హయత్ నగర్ పరిసరాల్లోకి సీఎం కాన్వాయ్ వచ్చిన సమయంలో బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు.. సీఎం కాన్వాయ్ లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం కాన్వాయ్ తోనే ప్రయాణం చేశారు. పోలీసులు వారిని ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినా మాటవినలేదు. దీంతో సీఎంపై ఎటాక్ అవుతుందేమోనని సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.                                               సీఎం కాన్వాయ్ తో పాటు 3 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ యువకులు.. ఆ తర్వాత కాన్వాయ్ దాటి ముందుకెళ్లిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది వైర్ లెస్ సెట్ల ద్వారా ముందు వెళ్తున్న కుర్రాళ్లని పట్టుకోవాలని.. పోలీసులను అప్రమత్తం చేశారు. వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో వారిని ఆపేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఆ యువకులు పోలీసులను ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకెళ్లారు. వారిని ఆపే ప్రయత్నంలో పోలీసులు తమ జీపుతో వారిని అడ్డుకున్నారు. జీపు ఢీకొనడంతో యువకులు కిందపడ్డారు.                                           తీవ్రంగా గాయపడిన ఆ కుర్రాళ్లను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఓ యువకుడికి రెండు కాళ్లు విరిగాయి. మరో యువకుడి ముఖానికి, తలకూ గాయాలయ్యాయి. ఈ కుర్రాళ్లు సీఎం కాన్వాయ్ పై దాడికి యత్నించలేదని.. మద్యం మత్తులో ఆకతాయితనంతో వ్యవహరించారని భావిస్తున్నారు. ఐతే పోలీసులే వారిని ఆపేందుకు ఢీకొట్టారా.. వారే పడిపోయారా అన్న విషయంపై క్లారిటీ లేదు. పోలీసులే ఢీకొట్టారని కొందరు చెబుతుంటే.. కుర్రాళ్లలో ఒకరికి మూర్చరోగం ఉండటం వల్లే కిందపడ్డారని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం కొద్దిసేపు కలకలం రేపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: