శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక ఆస్ట్రేలియా పర్యటనకు రెట్టించిన ఉత్సాహంతో బయలుదేరనుంది. రాంచీలో జరిగిన ఐదో వన్డేలో ఓటమి అంచులకు చేరిన టీమిండియాను కెప్టెన్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 286 పరుగులు సాధించింది. లంక కెప్టెన్ మాథ్యూస్ వీరోచిత సెంచరీతో 139 పరుగులతో చివరి దాకా క్రీజులో నిలిచాడు. ఇక ఆ తర్వాత 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, మొదట తడబడినా, కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ పుణ్యమాని ఒడ్డుకు చేరింది. 14 పరుగులకే రెహానే, రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఆదుకున్నాడు. చివరి దశలోనూ వరుసగా వికెట్లు పడుతున్నా, సడలని ధైర్యంతో లంక బౌలర్లను ఎదుర్కున్న కోహ్లీ, భారత్ కు వరుసగా ఐదో విజయాన్ని అందించాడు. అటు బ్యాటింగ్ లో చెలరేగి, బంతితోనూ మ్యాజిక్ చేసిన లంక కెప్టెన్ మాథ్యూస్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవగా, సిరీస్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన కనబరచిన కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: