ర్యాలీకోసం వెళ్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ కార్యకర్తల వాహనాలపై సాయుధులు జరిపిన కాల్పుల్లో కనీసం తొమ్మిది మంది ఆ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. ర్యాలీ వేదిక అయిన జీలమ్‌లోని సయ్యద్ జమీర్ జాఫ్రీ స్టేడియంకు అయిదు కిలోమీటర్ల దూరంలోని ఘర్మాలా వద్ద తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల వాహనాలపై అధికార పాకిస్తాన్ ముస్లింలీగ్ (పిఎంఎల్-ఎన్) పార్టీకి చెందిన మాజీ లెజిస్లేటర్ నాయకత్వంలోని సాయుధులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల వాహనాలు జాహ్రీ స్టేడియంకు చేరువవుతున్న సమయంలో పిఎంఎల్-ఎన్ కార్యకర్తలు దాడి చేసినట్లు పిటిఐ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎజాజ్ చౌదరి చెప్పారు. కనీసం తొమ్మిది మంది కార్యకర్తలకు తూటా గాయాలయ్యాయని, వారిని జీలమ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పాకిస్తాన్-ఇ-తెహ్రీక్ పార్టీ కార్యకర్తలే ముందు తమ ఇంటిపై కాల్పులు జరిపారని ఖదీమ్ ఆరోపించారు. జీలమ్ ర్యాలీకి ముందు తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ దాడి జరిపినట్లు చౌదరి చెప్పారు. అయితే తాము ర్యాలీని వాయిదా వేసుకోబోమని, పంజాబ్ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీ వేదిక వద్దకు చేరుకుంటున్నారని, ఇదో చరిత్రాత్మక ప్రదర్శన అని ఆయన చెప్పారు.ఈ నెల 30న ఇస్లామాబాద్‌లో కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఇమ్రాన్ ఖాన్ ఇదివరకే ప్రకటించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ పై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ తాము జరుపుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి ఇమ్రాన్ దేశంలోని వివిధ నగరాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తుకు ముందు ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలన్న తన ప్రధాన డిమాండ్‌ను గత వారం ఉపసంహరించుకున్న ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టు జడ్జీలు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, మిలిటరీ ఇంటెలిజన్స్ అదికారులతో ఒక జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు కమిషన్ దర్యాప్తులో తేలితే నవాజ్ షరీఫ్ రాజీనామా చేసి తాజాగా ఎన్నికలు జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: