కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రతిభను ఆమె తండ్రి ఎన్టీ రామారావు గుర్తించలేకపోయారు. గుర్తించి ఉంటే ఆమె తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యేవారు అని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివారం ఆయన కర్ణాటకలోని పావగడ పట్టణంలో కమ్మ హాస్టల్ వద్ద బాలికల వసతినిలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయ సన్యాసం తీసుకున్న తరువాత వేదికలపై మాట్లాడడం ఇదే మొదటి సారని, అందులోనూ కార్యక్రమ నిర్వాహకుల ఒత్తిడి మేరకు మాట్లాడుతున్నానని చెప్పారు. రాజకీయాల గురించి అసలు మాట్లాడనని చెబుతూనే.. పురందేశ్వరిపై పొగడ్తల వ ర్షం కురిపించారు. ‘ఈమెకు ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్నాయి. ఎన్టీఆర్ ఎం దుకో గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఎంతోమంది సీఎంలు అవుతున్నారు. ఆ పదవికి పురందేశ్వరి అన్ని విధాలా అర్హురాలు’ అని అన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ తెలుగు వాళ్లను మద్రాసీలుగా భావిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. కులాభిమానం ఉండాలని.. దురభిమానం ఉండకూడదని ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. కులమత భేదం లేకుండా విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, మాజీ మంత్రి సుబ్రమణ్యం నాయుడు, ఎమ్మెల్సీ ఉగ్రప్ప, ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, కమ్మసంఘం నాయకులు డాక్టర్ వెంకటరామయ్య, డీసీ రామాంజనేయులు, ఎంపీ చంద్రప్ప, చన్నిగప్ప, ప్రత్తిపాటి ఆంజనేయులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: