కలియుగం అన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు! ఇది కల్తీయుగం అన్నది మాత్రం జగమెరిగిన సత్యం! ఈ కల్తీ గురించి బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన గొడవ ‘పాలు తాగితే ప్రమాదమన్న’ భయాందోళనలను సృష్టించింది! హెరిటేజ్ సంస్థ వారు సరఫరా చేస్తున్న పాలలో ప్రాణాంతకమైన కల్తీ పదార్ధాలు కలిసాయా లేదా అన్నది విస్తృత వైపరీత్యంలో సముద్రంలో బిందుకణం వంటిది! అందువల్ల హెరిటేజ్ సంస్థ పాలు కాని మరో సంస్థ పాలు కాని కల్తీ అయినాయంటే అందులో ఆశ్చర్యం ఆవగింజంతైనా అక్కరలేదు!! ఆవాలలో కూడ కల్తీ జరిగిపోతోంది! ‘పాల’ను ‘జెర్సీ’తో కల్తీచేసినప్పుడే పాలగుణం పాడయిపోయింది! పంటలను ‘బిటి’ జీవ రసాయనంతో కల్తీ చేస్తున్న ‘జన్యు సంకరం’ నడిచిపోతున్న ప్రధాన వైపరీత్యం!! ఇలాంటి విస్తృతమైన కల్తీకి కారణమైన విధానాలను దశాబ్దులుగా మన దేశంలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి! పాలలో ఆక్సిటోసిన్ కలిసిపోవడం ఈ విస్తృత సాంకర్యంలో ఒక చిన్న అంశం! మన పాడిపంటలను పాడుచేస్తున్న కల్తీ నిజానికి ఉదాత్తమైన విధానంగా చొచ్చుకుని వస్తుండడం జనానికి పట్టని మహా విషయం!! హెరిటేజ్ సంస్థ వారి ఒక రకం-బ్రాండ్ పాలను నెలరోజులపాటు అమ్మరాదని కేరళ ప్రభుత్వం నిర్దేశించిన మాట వాస్తవమేనట! ఆ సంస్థ వారే వెల్లడించిన అంశమిది! కానీ ఆ తరువాత ఆ పాలలో ఎలాంటి కల్తీ పదార్ధాలు లేవని కనిపెట్టిన కేరళ ప్రభుత్వం తరువాత ఆ రకం పాలను కూడా అమ్ముకోవడాన్ని అనుమతించేసిందట! ఇది హెరిటేజ్ సంస్థ ఇచ్చిన స్పష్టీకరణ! హెరిటేజ్ సంస్థలకు గేదెలు కాని ఆవులు కాని లేవట! అందువల్ల తాము ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌లతో పాడి పశువులు సంకరం చేసే ప్రసక్తి లేదని సంస్థవారి వివరణ! హెరిటేజ్ సంస్థ రాజకీయ కుటుంబానికి చెందినది కాబట్టి ఈ వ్యవహారంపై శాసనసభలో ప్రస్తావన జరగడం సహజం! ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోకూడ హెరిటేజ్ ఉత్పత్తులను నిషేధించాలని కోరడం కూడ సహజం!! తెలంగాణ ప్రభుత్వం నిషేధించలేదు కాబట్టి మొత్తం వ్యవహారం ఉద్ధరిణిలో ఉప్పెనవలె సమసిపోవచ్చు!! జంటనగరాలలో ప్రభుత్వం సేకరించిన ముప్పయి రెండు పాల ప్యాకెట్లలో పదకొండు ప్యాకెట్లలోని పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవట! కానీ రాష్టవ్య్రాప్తంగాను దేశవ్యాప్తంగాను వివిధ సంస్థలు రకరకాల పేర్లతో చెలామణి చేస్తున్న పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేదన్నది పదిహేను ఏళ్ల క్రితమే ధ్రువపడిన వాస్తవం!! అప్పటినుంచి ఇప్పటికీ కల్తీ పాలను నిరోధించలేకపోవడం ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న ప్రధాన సమస్య! జంటనగరాలో సేకరించిన పాల నమూనాలలో హెరిటేజ్ నమూనాలు ఉండవచ్చు, ఇతర సంస్థల నమూనాలు ఉండవచ్చు!! కానీ అసంఖ్యాక ప్రజల వంట ఇళ్లలోకి చేరిపోతున్న పాకెట్లలోని పాలలో కల్తీ జరిగిందా లేదా అన్నది ఎవరు నిర్ధారించగలరు? రోజుల తరబడి నిలువ ఉండే-టెట్రా-పాలు, వెన్న తీసిన-టోన్డ్-పాలు, ప్రాకృతీకరించిన-పాశ్చురైజ్డ్-పాలు, సంపూర్ణత్వం సిద్ధించుకున్న-హోల్-పాలు, ఇలా వివిధ రకాల పేర్లతో వివిధ సంస్థలు పాలు అమ్మేస్తున్నాయి! కొంటున్న జనానికి వీటి మధ్య ఉన్న ప్రామాణిక అంతరం గురించి గాని, వాటి ప్రాశస్త్యం గురించి కాని తెలియదు!! ప్లాస్టిక్ పాకెట్ మీద ఉన్న ధర కంటె ఒకటో రెండో రూపాయలు అధికంగా చెల్లించి పాలు కొనడం మాత్రమే ప్రజలకు తెలిసిన వ్యవహారం! ఆవుపాలు కొంటున్నవారు కేవలం భక్తితో దేవుడికి అభిషేకించడానికి వాటిని వినియోగిస్తున్నారు! ఆవుపాలు తాగడానికి పనికి రావన్నది, ఆవు నెయ్యి తినడానికి కాదన్నది వినియోగదారులలో అత్యధికుల విశ్వాసం! అవి కేవలం హోమాలకు, హవనాలకు, అభిషేకాలకు మాత్రమే ఉపయోగపడే అపురూప పదార్ధాలన్నది వ్యావహారిక వాస్తవమై కూచుంది! ఈ దేశ ప్రజల విశ్వాసాలు ఇలా కల్తీ అయిపోతుండడం గురించి ఎవ్వరికీ పెద్దగా ధ్యాసలేదు. తినడానికి గేదెల నెయ్యి, తాగడానికి గేదెల పాలు మాత్రమే ఉపయోగించాలన్నది విశ్వాసం!! ‘‘శరత్కాలంలోని చంద్రుని వెనె్నల వంటి తెల్లనైన పెరుగు’’-మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి-తనకు ఇప్పించమని పూర్వం ఎప్పుడో ఒక పండితుడు రాజుగారిని యాచించాడట! ఆరోజులలో అధికాధికులు ఆవు పెరుగునే ఆరగించేవారు! అందువల్ల గేదెల పెరుగు అపురూపమైన పదార్ధమైంది! కానీ ఇప్పుడు గేదెపాలు, గేదె పెరుగు, గేదె నెయ్యి, గేదె వెన్న సర్వసాధారణ ఖాద్య పదార్ధాలు! అందువల్ల ఆవుపాలు తాగాలని భావించేవారు ఎవరైనా ఉంటే వారు తాగుతున్నది కల్తీపాలు... ఆవుపాలను ఎలా తయారుచేస్తున్నారు?? గేదె పాలలో పసుపు పచ్చటి రసాయనాన్ని కలిపి పాకెట్లలో నింపుతున్నారు! ఆ పాలను కాచేసరికి పచ్చని పదార్దం విడిపోయి పాలు మళ్లీ, గేదె పాలంత తెల్లగా తయారైపోతున్నాయట! కాచకుండా అభిషేకాలు చేసేవారికి ఈ సంగతి తెలీదు! ఆవుపాలు గేదెపాలంత తెల్లగా ఉండవని మాత్రమే తెలుసు! ఈ ఆవుపాలను కాచి వేసవి కాలంలో పెరుగు చేసిన తరువాత మరోవైపరీత్యం బయటపడుతోందట! ఆ పెరుగు వెండి తీగెల, వెండి దారాల వలె సాగిపోతూ ఉంటుంది! పాలు సరఫరా చేసేవారు సైతం అంగీకరించిన వాస్తవమిది! పాల ఉత్పత్తి తగ్గి గిరాకీ అధికంగా ఉండే వేసవి రోజులలో పాలపిండిని నీటిలో కలిపి పాలు సరఫరా చేయడం ప్రఖ్యాతమైన వ్యవహారం!! పాలపిండిని మాత్రమే కలుపుతున్నారా? మైదాపిండిని కలుపుతున్నారా? మరో పిండిని కలుపుతున్నారా? అన్నది పరిశోధకులు ఇంతవరకు తేల్చలేదు! యూరియా వంటి ఎరువులను పాలలో కలుపుతున్నారన్నది దేశంలోని అనేక రాష్ట్రాలలో నిర్ధారణ జరిగిన అంశం! ఇది మొదటి రకం కల్తీ! ఇది చట్టవిరుద్ధమైనది! కానీ చట్టబద్ధమైన కల్తీ ఎప్పుడో జరిగిపోయింది. జెర్సీ రకం విదేశీయ జంతువుల జన్యుకణాలతో మనదేశంలోని ఆవుల సంతతి కల్తీ అయిపోయింది! ఈ జెర్సీ ఆవుపాలు నెయ్యి వైద్య చికిత్సలకు పనికిరావన్నది ఎప్పుడో ధ్రువపడిపోయింది!! ‘పంచగవ్యాల’ చికిత్సకు, పంచగవ్యాలతో తయారయ్యే ఎరువులకు దేశవాళీ ఆవులు మాత్రమే పనికి వస్తాయి! కానీ దేశవాళీ ఆవులను మాంసం కోసం శతాబ్దుల తరబడి హత్య చేసారు! అందువల్ల జెర్సీ వంటి సంకర జాతుల ఆవుల పాలు మాత్రమే మన సౌభాగ్యం!! వీటితోనే భక్తాదులు శ్రద్ధతో అభిషేకాలు చేస్తున్నారు! జెర్సీ రకం ఆవుపాలను పాల ఉత్పత్తులను తాగడం వల్ల తినడంవల్ల క్రమంగా మన పొట్టలో కాన్సర్ కణాలు పెరుగుతాయన్న పరిశోధన ఫలితాలకు పెద్ద ప్రచారం లేదు...అందువల్ల ఆవుల ఉత్పత్తుల కంటే గేదెల ఉత్పత్తులను ఆరగించడమే సాపేక్షంగా ఆరోగ్యకరమన్నది జరుగుతున్న ప్రచారం!! గేదెల పాల కల్తీ గురించి ఇప్పుడు ప్రధానంగా గొడవ జరుగుతోంది!! ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల గేదెలలో పాల ఉత్పత్తి బాగా పెరిగిపోతోందట! కానీ ఈ ఆక్సిటోసిన్ పాల స్వభావాన్ని మార్చివేస్తోంది! ఈ పాలు తాగిన దూడలు త్వరగా ఎదుగుదల కావడం ఒక వైపరీత్యం! ఈ పాలు తాగిన పాపలకు, బాలురకు అత్యంత వేగంగా వన లక్షణాల ఏర్పడుతున్నాయట! ఇది మన వైపరీత్యం! గేదె అతి పెద్ద మోతాదులో పాలిచ్చి అతి త్వరగా చనిపోవడం ఇంకో వైపరీత్యం!! ఈ వైపరీత్యాలకు విరుగుడును కూడ కల్తీ ముఠాలు కనిపెట్టాయట! పామాలిన్ నూనె, వంట సోడా, యూరియా, సబ్బులు, మైదాపిండి వంటి వాటిని రసాయనాలలో మేళవించి నకిలీ పాలను తయారుచేసి పాకెట్లకెత్తుతున్నారట! మనం తాగుతున్నది ఏ పాలు??(source)

మరింత సమాచారం తెలుసుకోండి: