రాజధాని ప్రాంతంలో భూసమీకరణ రోజురోజుకూ క్లిష్టతరమవుతోంది. ప్రభుత్వ హామీలపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు.. ఇప్పుడు ఏకంగా ఆందోళన బాట పట్టారు. భూములు లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని పురుగుల మందుల డబ్బాలు పట్టుకుంటున్నారు. తాజాగా వెంకటపాలెం, నిడమర్రుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతులకు నచ్చజెప్పేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెళ్లిపోవాలంటూ రైతులు నినాదాలు చేశారు. రైతులంతా మూకుమ్మడిగా భూములిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యేకు దిక్కుతోచలేదు.                                                    మరికొన్నిగ్రామాల్లో మాత్రం భూసేకరణ పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. మంగళవారం రాజధాని ప్రాంతం నుంచి వచ్చే రైతులతో చంద్రబాబు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇది కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇస్తున్న హామీలకు అదనంగా మరికొన్ని వెసులు బాట్లు కావాలని రైతులు కోరే అవకాశం ఉంది. ఎకరానికి ప్రభుత్వం ఇస్తానన్న వెయ్యి గజాల భూమికి తోడు.. మరో 200గజాలు అదనంగా ఇవ్వాలని.. కమర్షియల్ ప్రాంతంలో మరో 200 గజాలు ఇవ్వాలని రైతులు కోరే అవకాశం ఉంది.                                                         హామీలకు చట్టబద్దత కావాలని డిమాండ్ చేయవచ్చు. అంతే కాకుండా వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే విషయంతో పాటు మరికొన్ని సమస్యలు ముఖ్యమంత్రికి నివేదించే అవకాశం ఉంది. మంగళవారమే.. రాజధాని బిల్లుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇందులో రాజధానిని.. రాజధాని ప్రాంతాన్ని గుర్తించి.. ప్రకటిస్తారు. దీంతోపాటు మారిటైమ్ బిల్లుపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. కోస్తాంధ్రను లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: