శాసనసభ్యులు, శాసమండలి సభ్యుల జీతాలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. నెలకు రూ.2 లక్షల వరకు వారి జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయిం చినట్లు సమాచారం. మంత్రుల జీతాల రెట్టింపు చేసే అంశంపైనా, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్లు పెంచాలని నిర్ణయించారు. పార్లమెంట్‌ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న జీతభత్యాలు సరిపోవడం లేదని భావించిన ముఖ్యమంత్రి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే వారికి కూడా అలవెన్సులు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. రూ.2 లక్షల చొప్పున జీతాలు చెల్లిస్తే ప్రతి నెలా రూ. 2.5 కోట్లు, ఏడాదికి రూ. 30 కోట్లు, ఐదేళ్లకు రూ. 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎంత మేరకు జీతాలు పెంచాలనే విషయమై ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన సచివాలయంలో సోమవారం సమీక్ష జరిగింది.  ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి ఎస్‌.నర్సింగ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రూ. 95వేల వరకు జీతభత్యాలు అందుతున్నాయి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఈ జీతాలు లేవని ముఖ్యమంత్రి భావించారు. ప్రజాప్రతి నిధులు నిజాయితీగా పనిచేయాలని తాను కోరుతున్నానని, అలాంటప్పుడు వారికి సరిపోయేంత జీతం కూడా ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ సొంత వాహనాల్లో నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని, అసెంబ్లీకి హాజరవుతున్నారని, వివిధ కమిటీల్లో సభ్యులుగా ఉండడం వల్ల పలు సమావేశాల కు హాజరవుతున్నారని, జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్ర మాలకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. వీరికి జీతాలు పెంచడం అనివార్యమని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు రూ. 2 లక్షల వరకు జీతాలు ఇవ్వాలని సమా వేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర మంత్రివర్గ హోదా కలిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 36 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 75 కోట్లు చెల్లిస్తున్నారు. జీతాలు పెంచితే ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 75 కోట్లు భారం ఉంటుందని నిర్ణయించారు. ఐదేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదించే బడ్జెట్‌లో ఇది 0.14 శాతం మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. మంత్రులకు కూడా జీతాలు రెట్టింపు చేసే విషయాన్ని పరిశీలించాలని ఆయన నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: