ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయం నిమిత్తం తీసుకున్న బంగారు రుణాలను చెల్లించాలని లేకుంటే జప్తు చేస్తామని బ్యాంకర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక పక్క మాఫీకి అన్ని అర్హతలు ఉండగా, మరోపక్క వాటిని చెల్లించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు నోటీసులు ఇవ్వడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయం కలెక్టర్ల దృష్టికి వచ్చినా వారు పట్టించుకోవడం లేదని పలువురు రైతులు తీవ్ర అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రుణాలతోపాటు, వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం పట్టాదార్‌ పాసుపుస్తకాలపై బంగారాన్ని తనఖాపెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతుండగా, దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ బ్యాం కులతోపాటు, కరూర్‌ వైశ్యా బ్యాంకు తదితర ప్రైవేటు బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకే అడ్డదార్లు తొక్కుతుం డడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో గత పది రోజులుగా బ్యాంకులు రైతులకు బకాయిల వసూళ్లకు నోటీసులు పంపుతున్నాయి. దీంతో ప్రధానంగా బంగారంపై లక్ష రూపాయల వరకూ రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అంతేకాకుండా మాఫీకి అర్హత కలిగిన రైతుల పేర్ల జాబితాల విషయంలో బయటపెట్టేందుకు బ్యాంకులు సుతారమూ అంగీకరించడం లేదు.  ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు మాఫీకి అర్హత సాధించిన రైతుల జాబితాలను పంపినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రకటించగా, బ్యాంకులు మాత్రం తమకు అటువంటి జాబితాలు రాలేదని తేల్చిచెబుతున్నాయి. అసలు మాఫీ జాబితాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు పంపిందా లేదా అనేది మిష్టరీగా తయారైంది. వ్యవసాయ, బంగారు రుణాల మాఫీ విషయమై చంద్రబాబునాయుడి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడంతో అది ఇప్పుడిప్పుడే జరిగే పనికాదని భావిస్తున్న బ్యాంకు అధికార్లు తాము ఇచ్చిన రుణాలను వసూళ్లు చేసేందుకు నోటీసులు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలువురిలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో రుణాల మాఫీ విషయమై అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 20 శాతం చొప్పున రుణాలను మాఫీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం రుణాల మాఫీపై ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడ లేదని ఆ రాష్ట్ర అధికార్లు సైతం అంగీకరిస్తున్నారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా మాఫీపై పురోగతి కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకూ కమిటీలు, నివేదికలు, విధివిధానాలు అంటూ రుణాల మాఫీ విషయమై చంద్రబాబునాయుడి ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేయడం పట్ల రైతాంగంతోపాటు, డ్వాక్రా మహిళల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవు తోంది. మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోగా, పాత బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నం కావడ రైతులు, డ్వాక్రా సంఘాలు జీర్ణించుకోలే కపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవ సాయ రుణాలతోపాటు, వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం బంగారంపై తీసుకు న్న రుణాలు 34 వేల కోట్ల రూపాయలను ఆ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంటుందని అంచనా. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు గుంటూరులో పదవీ ప్రమాణ స్వీకారం సంద ర్భంగా సంబంధిత ఫైలుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు సంతకం కూడా చేశారు. ఫైలుపై సంతకం చేసి దాదాపు ఏడు నెలలు జరిగినా ఇంత వరకూ రుణాల మాఫీ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. రుణాల మాఫీపై అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంతో రైతాంగానికి రుణాల మాఫీ కాక, కొత్త రుణాలు ఇవ్వకపోగా, బకాయిల కోసం వేధింపులు ప్రారంభం కావడం రైతులకు మింగుడు పడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: