మన దేశంలో రాజకీయ నాయకుల తర్వాత అత్యంత శక్తివంతమైన వారు బాబాలూ, స్వామీజీలే. రాజకీయ నేతల కంటే పవర్ ఫుల్ బాబాలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రుల నుంచి ప్రధాన మంత్రుల వరకూ తమ దగ్గరకు రప్పించుకునేవారూ ఉన్నారు. అలాంటి వీరు తాము..అన్ని విషయాలకూ అతీతులమనుకుంటారు. చట్టాలు, నిబంధనలు తమకు ఏమాత్రం వర్తించవని ఫీలవుతుంటారు. అలాంటి ఓ బాబాను అరెస్ట్ చేయడానికి హర్యానా పోలీసులు కిందామీదా పడుతున్నారు.                                     హర్యానాలోని బర్వాలాలో ఆశ్రమం నిర్వహిస్తున్న రాంపాల్ అనే వివాదాస్పద స్వామీజీపై 8 ఏళ్ల క్రితం ఓ హత్య కేసు నమోదైంది. అప్పటి నుంచి రాంపాల్ ఎలాంటి విచారణకు హాజరుకావడంలేదు. చివరకు కోర్టులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశాయి. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు.. ఇష్యూ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాకు రాంపాల్ అనుచరులు చుక్కలు చూపించారు. గొడవ జరుగుతుందని ఊహించి పోలీసులు భారీ సంఖ్యలో పారా మిలిటరీ బలగాలను సైతం వెంటపెట్టుకుని వెళ్లినా ఫలితం దక్కలేదు. రాంపాల్ అనుచరులు ఏకంగా పెట్రోల్ బాంబులు విసరడంతో 200 మంది పోలీసులు, మీడియా సిబ్బంది గాయపడ్డారు.                                 12 ఎకరాల విస్తీర్ణంలో.. చుట్టూ 50 అడుగుల ఎత్తులో శత్రుదుర్భేద్యంగా రాంపాల్ కోట నిర్మించుకున్నారు. అందులో దాదాపు 3వేల మంది ఆయన అనుచరులు వలయాల్లా ఏర్పడి రాంపాల్ కు కవచంగా ఏర్పడ్డారట. ఆశ్రమంలో పెద్దఎత్తున ప్రజలు కూడా ఉండటంతో పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. రాంపాల్ ను అరెస్టు చేస్తే ఆత్మాహుతి చేసుకుంటామని అనుచరులు బెదిరిస్తున్నారు. చివరకు దేశ హోంమంత్రే.. చట్టానికి కట్టుబడి ఉండాలని బాబాకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. రోజంతా ప్రయత్నించినా బాబాను అరెస్ట్ చేయడం పోలీసులకు సాధ్యపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: