మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా వుండాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాలు ఆ దిశగా సాగుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులను గమనిస్తే మళ్లీ ఎన్నికలు తప్పేలా లేదని పవార్‌ స్పష్టం చేశారు. మహా అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు. శివసేన ప్రభుత్వంలో చేరుతుందని, తమ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్‌ చెప్పుకుంటున్నప్పటికీ ఆ ప్రభుత్వ సుస్థిరత తమ పార్టీ బాధ్యత కాదని పవార్‌ స్పష్టం చేశారు. శరద్‌ పవార్‌ వ్యాఖ్యలతో బిజెపి ప్రభుత్వం గందరగోళంలో పడింది. 'మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా వుండాలి' అని పవార్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్సీపీ రెండు రోజుల సమావేశాలను రారుగడ్‌ జిల్లా అలీబాగ్‌లో పవార్‌ మంగళవారం ప్రారంభించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అందుకు ఎన్సీపీ బాధ్యత వహించబోదని పవార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మొదటి రోజునే బీజేపీ ప్రభుత్వానికి ఎన్సీపీ బేషరతు మద్దతు ప్రకటించిన విషయం విదితమే. మజ్లిస్‌-ఇ-ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌(ఎంఐఎం) పార్టీ ఎదుగుదల వెనుక బీజేపీలో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని పవార్‌ ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం రెండు అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. 288 మంది సభ్యులు గల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 121, శివసేనకు 63, కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 మంది శాసనసభ్యుల బలం వుంది. బీజేపీ రాష్ట్రంలో ప్రస్తుతం మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. దేవేంద్ర ఫడ్నావిస్‌ ప్రభుత్వానికి ఎన్సీపీ బయటి నుండి మద్దతిస్తున్నది. ఎన్సీపీ మద్దతుతో గతవారం ఫడ్నావిస్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలు నెగ్గింది. అయితే, ఇది వివాదాస్పదమైంది. విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందడాన్ని శివసేన, కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించాయి. అసెంబ్లీలో గందరగోళం సృష్టించాయి. తాజాగా విశ్వాస పరీక్ష ఎదుర్కొనేలా బీజేపీ ప్రభుత్వాన్ని ఆదేశిం చాల్సిందిగా గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావును రెండు పార్టీలు కోరాయి. విశ్వాస పరీక్ష సమయంలో ఓటింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశాయి. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించుకోవడం పట్ల ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బీజేపీలో అత్యంత కీలకమైన శక్తులు ఎంఐఎం పెరుగుదలకు ప్రధాన కారణమని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం' అని పవార్‌ ఆరోపించారు. మహారాష్ట్రలోని ప్రస్తుత పరిస్థితి సుదీర్ఘకాలం సుస్థిర ప్రభుత్వాన్ని అందించేలా కనిపించడం లేదని పవార్‌ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత కొరవడిందని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా లేకపోవడానికి ఎన్సీపీ కారణం కాబోదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి పాలన విధింపుపై ప్రస్తావిస్తూ ప్రభుత్వం సుస్థిరంగా లేకపోతే అలాంటి పరిస్థితి పునరావృతమవుతుందని పవార్‌ హెచ్చరించారు. రాజకీయ అస్థిరత కొనసాగితే అప్పుడు నాలుగు నుండి ఆరు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. ఇది మహారాష్ట్రకు మంచిది కాదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి దీర్ఘకాలంలో మంచిది కాదన్నారు. పరిస్థితులు క్షీణిస్తే తాము ఎన్నికలకు వెళ్లడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని పవార్‌ వివరించారు. పాలకపార్టీ సక్రమంగా పాలన సాగించలేకపోతే అది కూడా ఇదే విధంగా ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం బీజేపీకి వుంటుందని తాను భావించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని పటిష్టవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనపై వుందన్నారు. కాగా, పవార్‌ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఎట్టిపరిస్థితుల్లో మహారాష్ట్రకు మరోసారి ఎన్నికలు రాబోవని స్పష్టంచేసింది. తాను ఇటీవల చేసిన ప్రకటనలను పవార్‌ మరోసారి చదువుకోవాలని శివసేన ప్రతినిధి సంజరు రౌత్‌ గుర్తు చేశారు. ఫలితాల తర్వాత బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ సుస్థిర ప్రభుత్వం కోసం తాము అండగా వుంటున్నట్లు పవార్‌ చేసిన ప్రకటనను మరిచిపోరాదన్నారు. మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా చెప్పలేమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: