రాజకీయ పరిణామాలు.. పాలన పరమైన వ్యవహారాల గురించి స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ విధానాల గురించి మాత్రం మాట్లాడలేదు. జర్నలిస్టు శేఖర్ గుప్తా రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన కిరణ్ కుమార్ రెడ్డి పాలన పరమైన వ్యవహారాల గురించి మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ అయిన కిరణ్ ప్రభుత్వాల తీరును విశ్లేషించాడు. ఈ సందర్భంగా కిరణ్ కొత్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. అదేంటి అంటే... బీజేపీ గవర్నమెంటు అనవసర చట్టాలను తొలగించిందని కిరణ్ అంటున్నాడు. అనవసరమైన చట్టాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని.. అయితే ఇప్పుడు ప్రభుత్వం వాటని తొలగించి మంచి పని చేసిందని కిరణ్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రసంగంలో కిరణ్ రెడ్డి ఏకంగా వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించడం విశేషం! మరి కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ తరపున , అధిష్టానం అండదండలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కిరణ్ ఈ విధంగా పాలన విషయంలో బీజేపీని ప్రశంసించడం విశేషమే అనుకోవచ్చు! ఒకప్పుడు కాంగ్రెస్ పాలనను ఎనలేని స్థాయిలో ప్రశంసించాడు. మిగిలిన పార్టీలన్నీ పనికి మాలినవి అన్నట్టుగా మాట్లాడాడు! ఇప్పుడేమో ఏకంగా వాజ్ పేయి వంటి వారిని కూడా తలుచుకొంటున్నాడు! మరి కిరణ్ బీజేపీ లో చేరబోతున్నాడనేదానికి ఇంతకన్నా ఏం రుజువు కావాలి? ఈ అంశాన్ని కూడా ఆయన ఖండించడం లేదు. బీజేపీ లో ఎప్పుడో చేరతారనే అంశం గురించి స్పందిస్తూ.. సమయం, సందర్భం వచ్చినప్పుడుఆ అంశం గురించి మాట్లాడదామని కిరణ్ సెలవిచ్చాడు! మరి అందుకు ముహూర్తం ఎప్పుడో!

మరింత సమాచారం తెలుసుకోండి: