ఇండియా గేట్ కావచ్చు- రాజస్థాన్‌లోని జైసల్‌మేర్ కావచ్చు. లేదా బెంగళూరు రైల్వే స్టేషన్ ముందటి మెజిస్టిక్ కావచ్చు! ప్రాంతం ఏదైనా, ప్రదేశం ఏదైనా కనిపించే దృశ్యం ఒకటే! ఓ స్ర్తి డోలు వాయిస్తుంటే ఓ పది సంవత్సరాలలోపు అమ్మాయి, తండ్రో, అన్నో ఆదేశించినట్లుగా విన్యాసాలు చేస్తూ వుంటుంది. అది రింగుల్లోనుంచి దూరడం కావచ్చు, భూమిపైన తలను ఆనిచ్చి చేసే సోమర్ సాల్ట్ (ఒ్యౄళూఒ్ఘఖఆ) కావచ్చు. భూమికి దాదాపు అయిదు అడుగుల ఎత్తున కట్టిన తాడుపై చేసే విన్యాసం గగుర్పాటునే కల్గిస్తుంది. ఇలాంటివి సర్కస్‌లో చూస్తాం. కాని అక్కడుండే రక్షణ విధానం రోడ్లపై చేసే ఫీట్లలో ఎక్కడా కనపడదు. వీటిని చూసిన దానయ్యలంతా, అయ్యో పాపం అని, అమ్మాయి జీవితం నాశనమైందని, చదువు సంధ్య లేకుండా పోయిందని వాపోతారు.గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ఇటు ఖమ్మం, అటు ఛత్తీస్‌గడ్‌లోని కోయల గూడేలను ఆదిలాబాద్, నల్లమల అడవుల్లోని గోండు, చెంచు గూడేలను చూస్తే, బాల బాలికలనే తేడా లేకుండా అటవిలో నీటి మడుగుల్లో ఎలాంటి బెరుకు, బెదురు లేకుండా వేటాడుతూ తమ ఆహారాన్ని తామే సేకరించుకోవడం కనపడుతుంది. విల్లంబుల్ని ధరించడం, గొడ్డలిని భుజాన పెట్టుకోవడం, కొడవలిని చేతబూనడం ఈ ప్రాంతాల్లో ఓ దిన చర్యనే! ఈ రెండు ఉదాహరణల్లో పిల్లల హక్కులు ఘోరంగా హరించబడుతున్నాయని అనిపించడం సహజం! అదో పాఠశాల. ప్రాంతం, యాజమాన్యం ఏదైనా కావచ్చు. నాలుగ్గోడల మధ్యన చట్టబద్ధతతో కూడుకున్న ఓ దినచర్య జరుగుతుంటుంది. గంట గంటకో మార్పు జరుగుతున్నట్టు కనపడుతుంది. ఆ గదిని అజమాయిషి చేసే వ్యక్తులు మారుతూ వుంటారు. పోతే, మధ్యన మూత్ర విసర్జనకై (ఆడపిల్లలు దీన్ని గూడా వినియోగించుకోరు) ఓ పది నిమిషాలు, మధ్యాహ్న తిండికై గంట మాత్రం వదులు తారు. రెగ్యులర్ పాఠశాలకు ముందు, తర్వాత ‘బోధన’ అనే నినాదంతో గంటల తరబడి కూర్చుండబెట్టే ఎక్స్‌ట్రా బోధన అనే ‘శిక్ష’ దేశవ్యాపితమైంది. ‘‘సర్! ఈ కొత్తగా వచ్చిన ఆటల సార్ పిల్లల్ని చెడగొడుతున్నాడు. మా పాఠాలు బొత్తిగా పిల్లలు వినడంలేదు. హోమ్‌వర్క్ అసలే చేయడంలేదు. పాఠశాల అయిన తర్వాత ఇలా ఆటల పేరున ఆడిస్తే, మా సిలబస్ ఎలా పూర్తవుతుంది..? ఆయన ప్రేయర్ చేయిస్తే సరిపోతుంది..’’ అని ఉపాధ్యాయ వర్గం అంటే, ‘సరే!’ అనే ప్రధానోపాధ్యాయులు వేల సంఖ్యలో ఉన్నారు.‘‘సర్! ఇంటికాడ పిల్లలు పుస్తకం బట్టడంలేదు. హోంవర్క్ లేదంటున్నారు. ఎప్పుడు చూసినా ఆటలు, టీవీలు, జర మీరు భయం చెప్పాలి సార్..!’’ అనే తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నది. రోజువారి రొట్టెకోసం బాల్యం హరించబడడం ఒకటైతే, రేపటి భవిష్యత్ కోసమని, బతుకు తెరువు కోసమని పిల్లల క్షేమం కోసమని మొత్తం బాల్యమే హరించబడడం మరొకటి! ఈ రెండింటికి గల తేడాను గుర్తించే స్థితిలో ఎవరైనా వున్నామా అనేది అనుమానమే!కాలృకృత్యాలు కూడా తీర్చుకోనియకుండా, నిద్ర కూడా పోనీయకుండా లేపి స్కూలు పేరున తయారుచేసి భుజాన పిల్లల బరువుకు మించిన పుస్తకాల సంచిని తగిలించి, చేతుల్లో తిండి బ్యాగును పెట్టి, ఆటోల్లో కుక్కి, బస్సులో ఎక్కించి పంపించే తల్లిదండ్రులకు, ఇంటి దగ్గరుంటే చస్తే చదువుకోరని, సుదూర ప్రాంత హాస్టళ్లని వెతికి, మాటలు కూడా సరిగా రాని పిల్లల్ని బందీఖానాలకు పంపిస్తున్న దైవ సమానులైన తల్లిదండ్రులకు వారు చేస్తున్నదేంటో తెలుస్తున్నదా! వచ్చిందే లగాయతు ‘క్రమశిక్షణ’ అనే లేబుల్‌తో, చదువు అనే మూడక్షరాలతో, తరగతి గది అనే ఓ బందిలి దొడ్డిలో బంధించి ఉదయం, సా యంత్రం బాధించే ఉపాధ్యాయులకు పిల్లల గూర్చిన పరిజ్ఞానం వుందనుకుందామా! ఇదే సరియైన విద్యా విధానమని భావించే యాజమాన్యాలు, పరీక్షల్లో ఫలితాలకు టార్గెట్లను నిర్ణయించే ప్రభుత్వాలు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నామని తెలుస్తున్నదా..? అనుకూల వాతావరణంగాని జ్ఞాన నిర్మాణం గాని, సాంఘీకరణ (డ్యషజజచ్ఘీఆజ్యశ)గాని లేకపోయినా, కనీ సం విద్యార్థి స్వేచ్ఛగా నోరు విప్పలేని వ్యధశాలల గూర్చి ఏ వర్గానికి పట్టింపు లేదు. మొదట ప్రస్తావించిన పిల్లలతో ఈ వ్యధశాల పిల్లల్ని పోల్చినపుడు ఎవరు స్వతంత్రంగా ఎదుగుతున్నారంటే చెప్పే విశే్లషణ శక్తిగాని, విచక్షణ శక్తిగాని మనకు వున్నాయనుకుందామా..? ఉదయం గంట కొట్టినపుడు భారమైన అడుగులతో తరగతి గదుల్లోకి పోయే పిల్లలు, సాయంత్రం గంటకొడితే కేరింతలు కొడుతూ, బిరబిర పరుగెత్తుకుంటూ ఎందుకు బయటపడుతున్నారో ఒక్క క్షణం ఆలోచిస్తున్నామా..? సరిగ్గా 14 సంవత్సరాల క్రితం 2000 సం.లో ఆస్ట్రేలియాలో జరిగిన ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి బరువునెత్తి దేశ, రాష్ట్ర పరువును కాపాడింది. 20 సంవత్సరాల విజన్‌కై కలలుకంటున్న అప్పటి చంద్రబాబు రాష్ట్రంలో ఆటల నిర్వహణకై సూచలు చేయాలని కేబినెట్ కమిటీని వేస్తే, వెనువెంటనే ఆ కమిటీ ఏప్రిల్ 24, 2000న ఓ రిపోర్టును సమర్పించింది. ఈ రిపోర్టును ఆధారం జేసుకొని రాష్ట్ర ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వశాఖ మే 4, 2000 నాడు జీవో నెం.84ను, మే 11, 2000నాడు మరో జివో 85ను విడుదల చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యువతకు మధ్యన సత్సంబంధాల్ని కల్గించడానికై, శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికై, జాతి నిర్మాణానికై అనే నాలుగు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పై ఉత్తర్వులను విడుదల చేసి, అందులో అనేక సూచనల్ని చేసింది. ఆటలకోసం ఓ విజన్ డాక్యుమెంటును రూపొందింది. ఈ డాక్యుమెంటు ప్రకారం- విద్యలాగానే ఆటల్ని సార్వత్రికం చేయడం, వౌలిక సదుపాయాల్ని అందుబాటు (సార్వత్రికం)లోకి తేవడం, కరాటే, క్రికెట్, స్కేటింగ్ తప్ప 16 రకాల ఆటల్లో బాలురు (ని తినినివరకు, మరియు 19 ఏళ్ల పైబడినవారు) ఒక దాంట్లో ప్రావీణ్యం సంపాదించేలా చూడడం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రోత్సహించడం, పాఠశాల, కాలేజీ, స్పోర్ట్సు అసోసియేషన్‌లను సాప్ (డ-) గొడుకు కిందికి తేవడం, యోగాను కూడా సార్వత్రికం చేయాలని నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధనకై పాఠశాల విద్యలో ఆటలుండేలా విద్యా శాఖ చూడాలని, రాష్ట్ర, జిల్లా స్పోర్ట్సు అథారిటీలు వీటిని ప్రమోట్ చేయాలని, విధిగా పాఠశాల వ్యాయామం ఉపాధ్యాయులు అధికారులకు సహకరిస్తూ సంబంధిత ప్రాంతాల్లో శిక్షణలిస్తూ మండలానికి, జిల్లాకు రిపోర్టుల్ని పంపాలని, ప్రతి పాఠశాలలో స్పోర్ట్సు క్లబును ఏర్పాటుచేయాలని, సాప్ కేలండర్ ప్రకారం పోటీలను నిర్వహించాలని సూచించడం జరిగింది. వీటికి లోబడి ఆగస్టు 18, 2000 నాడు విడుదల చేసిన 94 జీవో ప్రకారం ప్రతీ ఉన్నత పాఠశాలకు, జూనియర్ కళాశాలకు వ్యాయామ ఉపాధ్యాయుల్ని నియమించాలి. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రతీ పాఠశాలలో కనీసం మూడు ఆటలు ఆడే సౌకర్యం వుండాలి. లేకపోతే స్థలాన్ని లీజుకు, కిరాయికి తీసుకోవాలి. యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ విధిగా ఆట వస్తువుల్ని కొనాలి. ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులకు, యుపిఎస్‌లలో ఒక ఉపాధ్యాయుడికి కొన్ని ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులందరికి కనీసం మూడు రకాల (16 వాటిల్లో) ఆటల్లో ఆడే అవకాశాన్ని కల్గిస్తూ కనీసం ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదించేలా చూడాలి. స్పోర్ట్సు అథారిటీ విధిగా పాఠశాలకై కిట్స్ ను సరఫరా చేయాలి. ప్రత్యేకంగా ఆటల కోసమై స్పోర్ట్సు స్కూళ్ళని, అకాడమీలను స్థాపించాలని నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ నిధులతో ముడిపడి వున్నాయి. కాబట్టి, రాష్ట్ర బడ్జెట్‌లో 0.5 శాతాన్ని, ఎక్సైజ్ డ్యూటీలో 5 శాతాన్ని, ఆస్తి పన్నులో 3 శాతాన్ని, వివిధ కార్వీల ఆదాయంలో 3 శాతాన్ని వీటికి కేటాయించాలని కూడా ఇందులో పొందుపర్చడమే కాకుం డా, మూడు స్థాయిల్లో (నితివరకు, ఇంటర్‌లో 19 సం. నిండిన తర్వాతి యువకుల్లో) వేర్వేరుగా ప్రావీణ్యతను గుర్తించాలని, ఆసియా, ఒలింపిక్స్, ప్రపంచ స్థాయి ఆటల్లో మెడల్స్ సాధించినవారికి లక్షల మొత్తంలో నజరానాలు ప్రకటించాలని కూడా రాసుకున్నారు. ఇలా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఆడినవారికి ఉద్యోగ అవకాశాల్ని, విద్యాలయాల్లో అయితే 10 శాతం సీట్లను కేటాయించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. తెలంగాణలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆటలకిచ్చిన కోటాను రద్దుచేయగా, చంద్రబాబుతోసహా ఎవరూ ఆ ఉత్తర్వుల్లోని ఏ నిబంధనను పాటించడంలేదు, ఒక్క స్పోర్ట్సు ఎకాడమీని ఏర్పాటుచేయడం తప్ప. అప్పట్నుంచి 2004, 08, 12లలో మూడుసార్లు ఒలింపిక్స్ జరిగాయి. ఏడాదిన్నర తర్వాత 2016లో మళ్లీ ఒలింపిక్స్ రాబోతున్నాయి. బుడ్డ బుడ్డ దేశాలు బంగారు పతకాలు సాధించుకుంటున్నాయి. చివరికి ఆసియా గేమ్స్‌ల్లో కూడా మనం అనుకున్న స్థాయి లో నిలవలేకపోతున్నాం. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్‌ను ప్రారంభించిన కెసిఆర్ జిల్లాకో క్రికెట్ స్టేడియంను నిర్మిస్తానని ప్రకటించడం, క్రీడలకు ఇక పండగేనని 16 మంది క్రీడాకారులకు పంచిన డబ్బు వివరాలని చెప్పడం బాగానే వున్నా, గ్రామ స్థాయి నుంచి, పాఠశాల స్థాయి నుంచి క్రీడల విధానాన్ని ఆయన ప్రకటించలేదు. నిజమైన క్రీడాకారులు ఎదగాలంటే దృష్టి సారించాల్సింది గిరిజన గూడాలపై, గ్రామాలపై, ప్రాథమిక పాఠశాలలపై. ఆటలు ఆడితే కొంపలు మునగవని, విద్యలో అవి భాగమని తల్లిదండ్రులకు, కొందరి ఉపాధ్యాయులకు తెలిసేలా చేయడంతోపాటుగా, పై జీవోలను దస్త్రాలనుంచి బయటకు తీసి, దుమ్ము దులిపి ఆచరణలోకి తీసుకవస్తే మనం ఒలింపిక్స్‌లోకి ప్రవేశించినట్లే! ఇక రాజీవ్ విద్యా మిషన్ ద్వారా వస్తున్న రకరకాల గ్రాంట్లలో వ్యాయామ ఉపాధ్యాయుడి గ్రాంటును, క్రీడల గ్రాంటును విధిగా చేర్చాల్సిన అవసరాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తిస్తే హైదరాబాద్ నుంచి వెలువడే హామీలకు విలువ పెరుగుతుంది.(source)

మరింత సమాచారం తెలుసుకోండి: