రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న రాజధాని రాజకీయంపై ప్రతిపక్షనేత జగన్ దృష్టిసారించారు. ఇప్పటికే ఆ పార్టీ తరపున నేతలు.. రాజధాని భూముల్లో పర్యటిస్తున్నారు. పార్టీ తరపున రాజధాని హక్కుల పరిరక్షణ కమిటీ పేరుతో రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలోని టీమ్ పర్యటించింది. బుధవారం గుంటూరు జిల్లాపార్టీ నేతల సమావేశంలో స్థానిక పరిస్థితులపై జగన్ ఆరా తీశారు. రాజధాని ప్రాంతంలో రైతులు ఏమనుకుంటున్నారు.. ఎంతమంది భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.. ఎంత మంది వ్యతిరేకిస్తున్నారు.. అంటూ క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగితెలుసుకున్నారు.                                                   రాజధాని ప్రాంతంలో దాదాపు 60శాతం వరకూ రైతులు భూములు ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. టీడీపీ వర్గాలు ఈ సంఖ్య 80 శాతం నుంచి 90 శాతం వరకూ ఉంటుందని చెబుతున్నా.. వాస్తవానికి ఈ సంఖ్య 60 శాతం దాటే అవకాశాలు ప్రస్తుతానికి లేవు. కాకపోతే.. మనం ఇచ్చినా ఇవ్వకున్నా.. ప్రభుత్వం ఎలాగైనా భూములు లాక్కుంటుందని మాత్రం రైతుల్లో స్పష్టత ఉంది. అందులోనూ భూములు కోల్పోయేవారిలో 70 శాతం వరకూ సన్నచిన్నకారు బక్కరైతులే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు సేకరించిన సమాచారం చెబుతోంది.                                      మరోవైపు రాజధాని ఇష్యూలో స్వయంగా జగనే రంగంలోకి దిగాలని గుంటూరు జిల్లా నేతలు ఆయన్ను కోరినట్టు తెలుస్తోంది. జగన్ స్వయంగా పర్యటిస్తే.. రైతులు తమ బాధలు చెప్పుకుంటారని.. ఆ విషయాలు మీడియాలో హైలెట్ అవుతాయని.. రైతులకు న్యాయం జరుగుతుందని కొందరు నేతలు జగన్ కు తెలిపారు. వారి వాదనపై ఆసక్తికనబరిచిన జగన్.. భూపోరాటనికి సిద్ధంగా ఉండాలని గుంటూరు జిల్లా నేతలకు సూచించినట్టు సమాచారం. మీ పోరాటాలు మీరు చేయండి.. ఎక్కడా వెనుకడుగు వేయవద్దని పార్టీ నేతలకు జగన్ సూచించారు. ప్రభుత్వం భూసేకరణ విధానం ప్రకటించిన తర్వాత.. అందులోని లోపాలపై రాజధాని గ్రామాల్లో తిరిగి ఉద్యమం చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: