కొత్త రాజధాని ప్రాంతంలో రైతుల పరిస్థితిలో రాత్రికి రాత్రే మారిపోతోంది. నిన్నటివరకూ అంతంతమాత్రంగానే వీరి కొనుగోలు శక్తి ఒక్కరోజు తేడాలోనే భారీగా పుంజుకుంటోంది. దీనికి కారణం ఆకాశాన్నంటిన భూముల ధరేనని వేరే చెప్పక్కర్లేదు. దళారీలు ఈ ప్రాంతంలో ఎగబడి భూములు కొంటున్నారు. కొత్త రాజధానిలో తమకు స్థలమో ఇల్లో ఉండాలనుకుంటున్న డబ్బున్న మారాజులు కూడా పెద్దయెత్తున భూములు ఖరీదు చేస్తున్నారు. ఇందుకోసం రైతులకు భారీ మొత్తాలు చెల్లించేందుకూ వెనకాడటం లేదు. ‘ఒకప్పుడు ఇక్కడ రైతులు టీవీ కొనుక్కోవాలన్నా ఓ మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా వెనకా ముందూ ఆడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏం కావాలన్నా ఇట్టే కొనుగోలు చేస్తున్నారు. భూముల ధర పెరగడమే దీనికి కారణం’ అని మందాడం గ్రామానికి చెందిన రైతు ఆర్. శ్రీనివాసులు అన్నారు. ఒకప్పుడు కొనాలని ఉన్నా కొనుక్కోలేకపోయిన ఎల్‌సిడిలు, ఎల్‌ఇడిలు, సెల్‌ఫోన్లు వంటి వాటిని రైతులు బేరం కూడా ఆడకుండా కొంటున్నారు. రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతంలో ఐదారెకరాలు ఉన్న రైతులు సగం భూముల్ని అధిక ధరలకు విక్రయించి మరోచోట భూములు కొంటున్నారు. తుళ్లూరులోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూం సేల్స్ మేనేజర్ బి. మాధవన్‌ను కదిలిస్తే ఆయన మరింత ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పారు. గత కొన్ని రోజులుగా ఎల్‌ఇడి టీవీలు, డిష్ ఏంటెన్నాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పారు. తమ దుకాణానికి వచ్చే ప్రతి ఐదుగురు కస్టమర్లలో ఒకరు రాజధాని ప్రాంత రైతులే ఉంటున్నారని అన్నారు. వివిధ కార్లు, మోటార్ సైకిళ్ళ డీలర్లు తుళ్లూరులోనూ, ఇతర గ్రామాల్లోనూ షోరూంలు తెరిచారంటే ఈ ప్రాంత రైతుల కొనుగోలు శక్తి ఎంతలా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. తుళ్ళూరులో ఓ షెడ్డులో తాత్కాలికంగా తెరిచిన ఓ మోటార్ సైకిల్ షోరూం మేనేజర్ పి. ప్రకాశ్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల్లో పాతిక మోటార్ సైకిళ్ళు అమ్మామని చెప్పారు. త్వరలో తాము పూర్తి స్థాయిలో షోరూంను ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. చాలామంది రైతులు స్పోర్ట్స్ బైకుల్ని, పవర్ బైకుల్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ఆయన చెప్పారు. తుళ్ళూరులో పలు కార్ల కంపెనీలు కూడా తాత్కాలిక షోరూంలను ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: