తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దగ్గరి వెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అక్కడి సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతున్న వైసీపీ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నిశ్చయించుకుంది. అయితే ఇరు రాష్ట్రాల్లో ఒకే సమయంలో రంగంలోకి దిగాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రజలకిచ్చిన హామీల అమలు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ డిసెంబర్ 5న విశాఖపట్నంలో మహాధర్నా నిర్వహించనుంది. ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించనుందని ఆయన వివరించారు. మరోవైపు తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు వైసీపీ వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో వైసీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. ఆ పార్టీకి పట్టున్న ఖమ్మం జిల్లా నుంచి నాయకులు కొంతమంది.. టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కేవలం తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒక ఎంపి మాత్రమే ఉన్నారు. తెలంగాణలోని ఖమ్మం మినహా మిగతా తొమ్మిది జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులుగాని.. కేడర్ కాని లేదు. గత కొన్ని రోజుల క్రితం వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తెలంగాణ నాయకులతో చర్చలు జరిపారు. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి సుధాకర్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలి అంటే.. ఒక చరిష్మా ఉన్న నేత అవసరమని భావించిన జగన్... ఇప్పుడు సుధాకర్ రెడ్డికి చేదోడు వాదోడుగా తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు.. షర్మిలను నియమించారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు షర్మిలను నియమించడంతో. పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. త్వరలోనే షర్మిల తెలంగాణలో యాత్ర చేపట్టబోతున్నారు. తెలంగాణలో షర్మిల యాత్ర చేపడితే.. తప్పకుండా.. పార్టీ కొంతమేర బలం పుంజుకుంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. పార్టీకి లాభం చేకూరుతుందనికూడా నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: