హామీలను అమలు చేయని టీడీపీ ప్రభుత్వానికి అధోగతి తప్పదని నిరుపేదలు, సీపీఐ నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, నిరుపేదలకు అసైన్డ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చిన నిరుపేదలు, పార్టీ నేతలు, కార్యకర్తలు కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహావేశాలతో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు మెరుున్ గేటును మూసివేసి అడ్డుకోవడంతో కార్యకర్తలు గేటు ఎక్కి మరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ నాయకులను జీపులో బలవంతంగా తరలించేందుకు పోలీసులు యత్నించటంతో ఆందోళనకారులు అడ్డుపడి ప్రతిఘటించారు. జీపునకు అడ్డంగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు అతికష్టంపై నాయకులను స్టేషన్‌కు తరలించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులను అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ముట్టడి సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని విమర్శించారు. రుణమాఫీపై కాలయాపన చేయడం తగదన్నారు. అమలు చేయడానికి వీలుకాని హామీలను తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలను మోసగించి పబ్బం గడుపు కోవాలని చూస్తే సీపీఐ ఊరుకోదని స్పష్టం చేశారు. విదేశీ పర్యటనకు వె ళ్లి నిధులు తెస్తున్నది అస్మదీయులకు కాంట్రాక్టులు ఇప్పించి లబ్ధి పొందడానికేనని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని, అసైన్డ్ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: