అధికారం చేతిలో లేనప్పుడు ఆధార్ కార్డుపై తీవ్రస్థాయిలో పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఆధార్ అనేది ఒక అర్థంలేని ప్రక్రియ అని... ఆధార్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని... అసలు ఆధార్ అనేదాన్నే రద్దు చేయాలని తెలుగుదేశం అప్పట్లోడిమాండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ అఫిషియల్ వెబ్ సైట్ నుచూసినా.. పాతఫేస్ బుక్ పోస్టులను చూసినా అప్పట్లో టీడీపీ వారు ఆధార్ విషయంలో ఎంత నిరసనను తెలిపారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే తీరా అధికారం చేతికి అందాకా మాత్రం ఇప్పుడు అన్నింటికీ ఆధార్ అని అంటోంది టీడీపీ. ఈ మేరకు ప్రతివిషయంలోనూ ఆధార్ ను తప్పనిసరి చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆఖరికి హుదూద్ తుపాను భాధితులకు సాయం చేయడం విషయంలో కూడా ఏపీ గవర్నమెంట్ ఆధార్ తప్పనిసరి అని చెప్పింది. ఆధార్ లేని వారు ఎన్ని కష్టాల్లో ఉన్నా వారికి సహాయం చేసేది లేదని స్పష్టం చేసింది. మరి ఇటువంటి నేపథ్యంలో మరో వ్యవహారాన్ని కూడా ఆధార్ తో ముడి పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ సారి రైతుల ఉచిత విద్యుత్ కూ, ఆధార్ కు ముడిపెట్టారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆధార్ లేని రైతులకు ఉచిత విద్యుత్ లేదని స్పష్టం చేసింది! ఈ గురువారం నుంచి వారికి కరెంట్ బంద్ అవుతుందని ప్రకటించింది. మరి ఇలా ఉచిత విద్యుత్ విషయంలో కూడా ఆధార్ కు ముడిపెట్టి.. రైతులను ఇబ్బంది పెట్టడం ఏమిటో అర్థం కావడం లేదు. రైతులేమీ ఆధార్ కు వ్యతిరేకం కాదు. వాటి జారీ ప్రక్రియ సరిగా లేకపోవడంతో వారికి ఆధార్ కార్డులు లభించడం లేదు. అయితే తెలుగుదేశం వాళ్లే... ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఒకలా, అధికారం చేతికి అందాకా మరోలా వ్యవహరిస్తూ... సమాజంలోని అన్ని వర్గాలనూ ఇబ్బందుల పాల్జేస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: