ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదానికి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్, నీరు, విద్య వంటి విషయాల్లో వివాదాలు కొనసాగుతున్న సమయంలో కేంద్రం శంషాబాద్ డొమెస్టిక్ విభాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం ఇందుకు ఆస్కారమిస్తోంది. ఈ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ కే చెందిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో ఇప్పుడు తమ కల నెరవేర్చుకున్నారు.                                            గతంలో బేగంపేట విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది. ఇప్పుడా విమానాశ్రయం మూసేసి.. దాని స్థానంలోనే శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించినందువల్ల.. ఇప్పుడీ పేరు పెట్టడం చెప్పుకోదగ్గ విషయమేంకాదు.. కానీ శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమైన నాలుగైదేళ్ల తర్వాత.. అదీ రాష్ట్రవిభజన జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా.. కేంద్రంలోని తమ అధికారంతో ఈ పేరు పెట్టారన్న భావన తెలంగాణ ప్రాంత నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ సర్కారు కేంద్రంలో ఉన్న పలుకుబడి ఉపయోగించి తమపై కక్ష సాధిస్తోందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు.                                            శంషాబాద్ దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అప్పుడే గొడవ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది తెలంగాణపై ఏపీ పెత్తనంగా.... రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంగా.. తెలంగాణ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ విమర్శించారు. ఈ అంశంపై తాము నిరసన తెలుపుతామని శ్రీనివాస్ అన్నారు. మరోనేత వీహెచ్... కూడా తెలంగాణపై ఆంద్ర పెత్తనం ఇంకా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సుహుదృభావ వాతావరణాన్ని చెడగొట్టడానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుట్ర పన్నారని వీహెచ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలే ఈ రేంజ్ లో ఫైరయితే.. ఇక గులాబీనేతలు ఇంకెలా స్పందిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: