కొంతమంది నేతలు మీడియా నాడి బాగా తెలుసు.. ఏ మాట మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది.. ఏ కామెంట్ చేస్తే అటెన్షన్ అంతా మనవైపు వస్తుంది.. అన్న విషయం పసిగట్టడంలో వీరు సిద్దహస్తులు.. అందుకే ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. అలాంటి నేతల్లో రాయలసీమ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. కాంగ్రెస్ లో ఉన్నా.. ఇప్పుడు టీడీపీ కండువా వేసుకున్నా..మీడియాలో ఆయన పాపులారిటీకి లోటు లేదు. మొన్నే.. టీడీపీలో తనకు స్వేచ్చలేకుండా పోయిందంటూ కామెంట్ చేసి కలకలం సృష్టించిన జేసీ.. తాజాగా చంద్రబాబుపైనే సెటైర్లు వేసి మరోసారి సంచలనం సృష్టించారు.                                     టీడీపీ ఎంపీ అయ్యాక.. తొలిసారి బెజవాడలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఆయన.. పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. రాష్ట్ర విభజన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న తాము సైతం ఏమీ చేయలేకపోయామని..ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదని కామెంట్ చేశారు. అంతవరకూ బాగానే ఉంది.. ఆ తర్వాత.. ఎంతో అనుభవం, రాజకీయ పరిణితి ఉందనుకున్న చంద్రబాబు సైతం ఈ విషయంలో బోల్తాపడ్డాడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు అంచనాలు కూడా తప్పాయని జేసీ అన్నారు.                            జేసీ తాజా వ్యాఖ్యలతో తెలుగుదేశం శ్రేణులు అయోమయంలో పడ్డాయి.. ఇంతకీ జేసీ.. చంద్రబాబుపై సానుభూతి పెంచేందుకు అలా అన్నారా.. లేక.. చంద్రబాబు కూడా బోల్తాపడ్డాడని వెటకారం చేశారా.. ఈ విషయమే అర్థం కాక టీడీపీ నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఓవైపు చూస్తే జేసీ పొగిడినట్టే ఉందే.. మరోవైపు చూస్తే చంద్రబాబు కూడా అంచనాల్లో ఫెయిలయ్యాడని అర్థం వస్తోంది.. ఇంతకీ జేసీ బాబును పొగిడినట్టా.. తిట్టినట్టా.. ఐతే.. జేసీ వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎవరు ఎలా అర్థం చేసుకున్నా..వారికి అనకూలంగానే ఉండేలా మాట్లాడటం జేసీకి అలవాటేనని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు.. ఔను..అదీ నిజమే కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: