రాజధాని ప్రాంతంలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార పార్టీ రైతులంతా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేసుకుంటోంది. విపక్షాలు రైతులకు అన్యాయం జరగబోతోంది మేలుకోండంటూ రాజధాని ప్రాంతంలో సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తుళ్లూరులో వామపక్షాలు నిర్వహించిన సభ ఉద్రిక్తంగా మారింది. భూసమీకరణ విషయంలో రైతుకూలీలు, కౌలు రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వామపక్షనేతలు సభలో వివరిస్తుండానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు సభను అడ్డుకున్నారు. విద్యుత్ నిలిపేసి.. చీకట్లో దాడులకు పాల్పడ్డారు.                          భూసమీకరణ విధానంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానంపై సీపీఎం నేతలు నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరం లేదన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టేందుకే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణ విషయంలో సింగపూర్ ప్రభుత్వం పాత్ర ఏంటని నిలదీశారు. రాజధాని కోసం భూములు కోల్పోతున్న రైతులు, కౌలురైతులు, రైతుకూలీల సమస్యలు పరిష్కరించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని చెబుతున్నా వినకుండా టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని వామపక్షనేతలు వివరించారు.                                        భూసమీకరణపై చంద్రబాబు సర్కారు ఇప్పటికే ఒంటెత్తు పోకడ పోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఇతర పార్టీల సభలను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చేదే.. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఐతే.. వామపక్షనేతలు కూడా అనుమతులు తీసుకోకుండా సభలు నిర్వహించడం మంచిది కాదు. వామపక్షాలు- టీడీపీ ఘర్షణ విషయంలో పోలీసుల వైఖరిపైనా విమర్శలు వస్తున్నాయి. వారు ప్రేక్షకపాత్ర పోషించారని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రాజధాని రైతుల్లో అపోహలు పోగొట్టి అందరూ అంగీకరించే ప్రతిపాదనలతో ముందుకెళ్లడం అవసరం..

మరింత సమాచారం తెలుసుకోండి: