యూపీలో సమాజ్ వాద్ పార్టీ పాలన రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నో ఆశలతో జనం ఈ పార్టీకి అధికారం అప్పగిస్తే.. ములాయం, అఖిలేశ్ ఇద్దరూ విందులు, వినోదాలతో ప్రజల డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో... ముజఫర్‌నగర్‌ అల్లర్ల సమయంలోనూ... బాధితులు సహాయ శిబిరాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. అబ్బా కొడుకులిద్దరూ.. స్వగ్రామంలో గానా బజానాలు ఏర్పాటు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.                                                 ఈ వేడుకల కోసం అప్పట్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతే కాదు... సినిమా హీరోయిన్లు, డాన్యర్లను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి నృత్య ప్రదర్శనలు చేయించారు. అల్లర్ల సహాయ శిబిరాల్లో సరైన వసతులు లేక, చలికి తట్టుకోలేక 34మంది చిన్నారులు చనిపోయి బాధితులు విషాదంలో ఉంటే.. ములాయం కుటుంబ సభ్యులు మాత్రం వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది.                                             తాజాగా... ములాయంసింగ్ యాదవ్ 75వ జన్మదిన వేడుకలు కూడా వివాదాస్పదమయ్యాయి. పుట్టినరోజు వేడుకల కోసం విదేశాలనుంచి దిగుమతిచేసుకున్న విలాసవంతమైన గుర్రపుబగ్గీలో విహరించడం విమర్శలకు దారితీసింది. 40 మంది రాష్ట్ర మంత్రులు, 50 కార్లు వెంటరాగా.. అట్టహాసంగా ఈ ఊరేగింపు మౌలానా అలీ జౌహర్ యూనివర్సిటీ వరకు సాగింది. అక్కడ వేదికపై అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఆయన 75 అడుగుల పొడవైన అత్యంత భారీ కేక్‌ను కట్ చేశారు. దారి పొడవునా 200 వరకూ స్వాగత తోరణాల ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్ క్యాంపు నుంచి జౌహర్ వర్సిటీ వరకు 14 కిలోమీటర్లమేర వరకు ఈ ఊరేగింపు సాగింది. రాంపూర్ అంతటా పెద్దపెద్ద కటౌట్లు, ఫెక్సీలు ఏర్పాటుచేసి ఎస్పీ శ్రేణులు ములా యంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.                                      ఈ విలాసాలకు తోడు.. మంత్రి ఆజంఖాన్ మీడియాకు చెప్పిన వ్యంగ్య వివరణ మరింత వివాదాస్పదమవుతోంది. ఈ ఆడంబరాలకు నిధులు ఎక్కడివని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆజంఖాన్ అతితెలివితో సమాధానమిచ్చారు. డబ్బులు ఎక్కడినుంచి వస్తే ఏమిటి? కొంచెం తాలిబన్లు, కొంచం అబూసలేం, మరికొంచెం దావూద్ ఇబ్రహీం ఇచ్చారని వెటకారం చేశారు. ఈ వేడుకల కోసం రాంపూర్‌లో రెండురోజులు సెలవు ప్రకటించడం విశేషం. ములాయం జన్మదిన వేడుకల కోసం భారీ ఎత్తున ప్రజాధనం వృథా చేస్తున్నారని రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: