ఓ వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు..మరోవైపు రాజధాని భూ సమీకరణ అంశం...చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారపార్టీని గట్టిగా నిలదీస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, మరోవైపు కాంగ్రెస్....బాబు సర్కార్పై నిప్పులు కురిపిస్తున్నాయి. రాజధాని కోసం 30 వేల ఎకరాల భూ సమీకరణ...ఇప్పుడిదే హాట్టాపిక్గా మారింది. ఓ వైపు ప్రతిపాదిత రాజధాని పరిధిలోని అన్నదాతలు...మరోవైపు వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో బాబు సర్కార్పై విరుచుకుపడుతున్నాయి. రాజధానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని నిడమర్రు, తుళ్లూరు గ్రామాల్లో 10 వామపక్ష పార్టీలు డిమాండ్ చేసినట్లే కాంగ్రెస్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తోంది. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు భూములు అవసరమా...అని మండిపడుతున్న మండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య ...ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే...చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఒక్క భూ సమీకరణ విషయంలోనే కాదు....ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా బాబు సర్కార్పై ఒత్తిడి తెస్తున్నాయి విపక్షాలు. బాబుకు వ్యవసాయ రుణాలకు, పంట రుణాలకు తేడా తెలీదా అని నిష్ఠూరమాడారు వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి. ఎన్నికల వేళ అనంతపురం సభలో అన్ని రుణాలకు మాఫీ చేస్తానని ప్రకటించిన బాబు...గెల్చిన తర్వాత మాట మార్చారని ఆరోపించారు.  తక్షణం అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు నాగిరెడ్డి. సింగపూర్లో ఒక్క ఎకరా పంట భూమీ లేదని...ఏపీని ఇప్పుడు అలా తయారుచేయాలని బాబు అనుకుంటున్నారా అని మండిపడ్డారు. రుణమాఫీతో పాటు ఎన్నికల హామీలన్నిటినీ నేరవేర్చడం లేదంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ. వచ్చే నెల 5వ తేదీన కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది ఆ పార్టీ. రాజధానికి ఏకంగా 30 వేల ఎకరాలు ఎందుకంటూ...భూ సమీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముప్పేట దాడికి దిగడంతో టీడీపీ అభివృద్ధి నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే యత్నం చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: