హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడ తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృ త్వంలో కార్యదర్శుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిమితులు, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మొదటి దశలో 40 ప్రదేశాలలోని సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆకాశ హర్మ్యాలు (స్కై స్క్రాపర్స్‌) నిర్మించాలని నిర్ణయించారు. ఆయా ప్రదేశాలను గుర్తించారు. సచివాలయంలో శనివారం ఆకాశ హర్మ్యాల నిర్మాణం, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనపై దాదాపు 5 గంటల పాటు సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, అధికారులు నర్సింగ్‌రావు, ఎస్‌కె.జోషి, రేమాండ్‌ పీటర్‌, నాగిరెడ్డి, ప్రదీప్‌చంద్ర, సోమేష్‌కుమార్‌, స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని ప్రకటించారు. సాగర్‌లోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు వల్ల జల కాలుష్యం జరుగుతుందన్నారు. దీనిని నివారించడానికి నాలాల ద్వారా వచ్చే నీరు సాగర్‌లోకి చేరకుండా మళ్లింపు కాలు వలు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించిన ముఖ్యమంత్రి త్వరలోనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.100 కోట్లు నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వినాయక విగ్రహాలు, అమ్మవారి విగ్రహాల నిమజ్జనం వల్ల హుస్సేన్‌సాగర్‌ కలుషితం అవుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. అటు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మరోవైపు హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం తెచ్చే విధంగా ఇందిరాపార్కులో వినాయక్‌సాగర్‌ పేరుతో చెరువు నిర్మించి అక్కడే నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో త్వరలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్‌ నీటిలోనే గణేష్‌ నిమజ్జనం జరిపే సాంప్రదాయం ఉన్నందున వినాయకసాగర్‌ను కూడా హుస్సేన్‌సాగర్‌ నీటితోనే నింపాలని అధికారులను సూచించారు. వినాయకసాగర్‌ను కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయాలని సూచించారు. ఈ ఎండాకాలంలోనే హుస్సేన్‌సాగర్‌ నీటినంతా ఖాళీ చేసి అడుగు భాగంలో ఉన్న మలినాలను తొలగించాలని నిర్ణయించారు. ఈ పనులన్నింటినీ పర్యవేక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ప్రదీప్‌చంద్ర, ఎస్‌కె.జోషి, రేమాండ్‌ పీటర్‌, నాగిరెడ్డిలతో కూడిన ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన ఉప సంఘానికి బాధ్యతలను అప్పగించారు. సంజీవయ్య పార్కు ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్‌ నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ బుద్ధభవన్‌, రాణిగంజ్‌ బస్‌డిపో, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కుందన్‌బాగ్‌, పాటిగడ్డ, సెయిలింగ్‌ క్లబ్‌, యూత్‌ హాస్టల్‌, రాఘవసదన్‌, నర్సింగ్‌ కాలనీ, దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఎలక్ట్రిసిటీ భవన్‌, బుక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌, రిడ్జ్‌ హోటల్‌, బూర్గుల రామకృష్ణారావు బల్డింగ్‌, ఎక్స్‌పో టెల్‌, స్నో వరల్డ్‌ తదితర 40 ప్రాంతాల్లో మొదటి దశలో టవర్స్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ స్థలాలకు సంబంధించిన మ్యాప్‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. పెద్ద ఎత్తున టవర్స్‌ నిర్మిస్తున్నందున అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మొదటి నుండే సమగ్ర ప్రణాళికతో ముందుకుపోవాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. టవర్ల నిర్మాణానికి చాలా సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పారు. అటు హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం తేవడం, ఇటు హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి టవర్ల నిర్మాణం, రెండు సందర్భాల్లో కూడా పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: