తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ అసలే మొండితనానికి కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి వ్యక్తిని ఎంత తిట్టినా ప్రయోజనం వుండదు. పైగా, అది తనకు మరింత ఆయుష్షునిస్తుందని చెబుతుంటారు కేసీఆర్‌. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను.. అవన్నీ నాకు ఆశీర్వాదాల్లానే పనిచేశాయి.. అని కేసీఆర్‌ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన సెంటిమెంట్‌ మాటెలా వున్నా, కేసీఆర్‌ని ఎవరెంతగా తిట్టినా.. వారంతా తెలంగాణ ప్రజల దృష్టిలో తెలంగాణ వ్యతిరేకులైపోతున్నారు. ఇక, తెలంగాణ నేతల్లో ఎవరు ఎక్కువగా కేసీఆర్‌ని తిడతారో, అలాంటివారంతా తర్వాతి కాలంలో కేసీఆర్‌ పంచన చేరతారన్న సెంటిమెంట్‌ ఒకటుంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఒకప్పుడు కేసీఆర్‌ని ఏ స్థాయిలో విమర్శించారో అందరికీ తెల్సిందే. ఇప్పుడామె టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. టీఆర్‌ఎస్‌లో వున్న కడియం శ్రీహరి తదితరులంతా ఒకప్పుడు కేసీఆర్‌ని ఓ రేంజ్‌లో విమర్శించినవారే. మొన్నామధ్య ఎర్రబెల్లి దయాకర్‌రావు తెరాసలోకి జంప్‌ చేద్దామనుకుని, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఆయన కేసీఆర్‌ని విమర్శించడంలో మిగతావారికన్నా రెండాకుల ఎక్కువే చదివారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ లాంటోళ్ళూ ఇందుకు అతీతం ఏమీ కాదు. పరిస్థితులు ఇంత క్లియర్‌గా కన్పిస్తున్నా, అధినేత మెప్పు కోసం టీడీపీ తెలంగాణ నేతలు, కేసీఆర్‌పై నోరు పారేసుకుంటూనే వున్నారు. ‘సిగ్గుంటే నీ కొడుకు పేరు మార్చుకో..’ అంటూ కేసీఆర్‌పై తాజాగా నోరు పారేసుకున్నారు టీడీపీ తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు. శంషాబాద్‌ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ టెర్మినల్‌కి ఎన్టీఆర్‌ పేరు పెట్టడాన్ని తెలంగాణ అసెంబ్లీ వ్యతిరేకించి, తీర్మానం చేసింది. దాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి హైద్రాబాద్‌లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇంకేముంది.. టీడీపీ నేతలు, కేసీఆర్‌పై నానా రకాల విమర్శలూ చేసేశారు. ఇలాంటి దీక్షలతో, ఆందోళనలతో టీడీపీకి ఒనగూరే రాజకీయ ప్రయోజనం ఏమీ కన్పించడంలేదాయె. అయినా ఆ పార్టీ నేతలు పట్టువదలని విక్రమార్కుల్లా కేసీఆర్‌పై మాటల దాడి చేస్తూనే వున్నారు. ఎన్టీఆర్‌ పేరు విషయంలో కేసీఆర్‌ని విమర్శించడం కన్నా, స్వర్గీయ ఎన్టీఆర్‌ గొప్పతనం గురించి చాటి చెప్పడం ఉత్తమమేమో టీడీపీ నేతలు ఆలోచించుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: