రాష్ర్టంలో స్థిరమైన ప్రభుత్వముంది. పటిష్టమైన ప్రతిపక్షమూ ఉంది. ఈ రెండు పక్షాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంటే రాష్ర్టంలో పరిపాలన సవ్యంగా ఉంటుంది. ఈ రెండు కూడా అసమర్థంగా వ్యవహరిస్తే ఆ రాష్ర్ట పురోగతి ఏడుస్తున్నట్లే ఉంటుంది. రాష్ర్టాన్ని అభివృద్ధిబాటలో పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమై వుంటాలి. ఈ మార్గం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు కనిపిస్తే ప్రతిపక్షం కన్నెర్రజేసి ప్రభుత్వాన్ని దారికి తేవాలి. దురదృష్టమేమిటంటే ఆ రెండు ప్రయత్నాలు కనిపించకపోవడం. రాష్ర్టంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలను తొలగించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదు. రాష్ర్టంలో సమస్యలకంటే రాష్ర్టానికి అర్జెంట్గా సింగపూర్ లాంటి రాజధాని అవసరం అనే మైకంలో చంద్రబాబు ఉన్నాడు. నిద్రలేస్తే రాజధాని గురించి తప్పితే రెండో మాట లేదు ఆయన నోటి నుండి. సింగపూర్ లాంటి రాజధాని ఇప్పుడు మనకు అవసరమా అనేది ఆలోచన చేయడం లేదు. సింగపూర్ రాజధాని నగరం కాదు. అది ఒక దేశం. దాని పరిధి ఎటుచూసినా 30కిలోమీటర్లే. ఎకరా వ్యవసాయం కూడా లేదు. భూమి లేదు కాబట్టి వాళ్లు ఆకాశహార్మ్యాలు నిర్మించుకోవాల్సిందే. సెంటు వ్యవసాయం లేని సింగపూర్ కు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న మనకు ఆ దేశాన్ని ఏ విధంగా స్ఫూర్తిగా తీసుకోవాలో బోధపడదు. చంద్రబాబు కాన్సెప్ట్ కృష్ణా-గుంటూర జిల్లాలలో పచ్చటి పొలాలను పాడుచేసి సింగపూర్ లో లాంటి బిల్డింగ్ లను కట్టడం లాగే వుంది. రాజధానికి మా భూములిచ్చేది లేదని రైతులు నెత్తినోరు బాదుకుంటున్నా వారి నుండి బలవంతంగానైనా భూములు లాక్కోవడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం అందుకు కొత్త చట్టాన్ని కూడా తెచ్చింది. హైదరాబాద్ పదేళ్ల దాకా ఉమ్మడి రాజధానిగానే ఉంటుంది. ఈలోపు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో తాత్కాలిక రాజధానిని సాదాసీదాగా ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంపై దృష్టిపెట్టడంతో పాటు సాగరతీరాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదానిపై ఆలోచించాలి. ఇవన్నీ ప్రభుత్వం చేయడం లేదు సరికదా, అవినీతి పేట్రేగిపోతోంది. అధికారుల బదిలీలను పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చేసారు. మరోపక్క కృష్ణా, గుంటూరు రైతులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు.  ఈ పరిస్థితులు రాష్ర్టంలో ప్రతిపక్షానికి ఒక పదునైన ఆయుధం లాంటివి. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం విరుచుకుపడొచ్చు. గుంటూరుజిల్లా రైతుల్లో వస్తున్న ఆందోళనను ఆసరాగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్నే నడపవచ్చు. రాష్ర్టంలో వైకాపా బలహీనంగా ఏమీ లేదు. 66మంది సభ్యులతో చాలా బలంగా ఉంది. కాని ఎందుకనో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభావవంతంగా దాడి చేయలేకపోతోంది. ఇప్పుడు కనుక వైకాపా రైతులకు అనుకూలంగా ఉద్యమం నడిపితే అది అగ్గిలా రాజుకోవడం ఖాయం. కాని వైకాపా ఆ ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను అవకాశంగా మలచుకుని ఎదురుదాడికి దిగడానికి ఏ మాత్రం సాహసించడం లేదు. రాష్ర్టంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ దొందూదొందే అన్నట్లుగా మారడం శోచనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: