ఏపీ రాజధాని భూసమీకరణపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. చంద్రబాబు జపాన్ టూర్లో ఉన్నందువల్ల ఆయన తిరిగి వచ్చాకే భూసమీకరణకు సంబంధించిన విధాన ప్రకటన ఉంటుందని మంత్రులు చెబుతున్నారు. ఐతే ఏపీ రాజధాని విస్తీర్ణం ఎంత.. ఎంత విస్తీర్ణంలో తొలివిడతగా భూమి సేకరిస్తారు.. మలివిడతలో ఎంత భూమి సేకరిస్తారు.. ఈ రెండు కాకుండా మూడో విడత కూడా భూసమీకరణ ఉంటుందా.. అంటే ఎంత విస్తీర్ణంలో భూములు సేకరిస్తారు.. అనే విషయాలపై స్పష్టత కనిపించడం లేదు. ఇప్పటివరకూ మంత్రులు తొలివిడతలో 30 వేల ఎకరాలు... రెండో విడతలో 70 వేల ఎకరాలు సేకరిస్తామని చెబుతున్నారు.                                          ఐతే.. ఈ రెండూ కాకుండా మూడో విడతగా కూడా భూ సమీకరణ ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. జపాన్ టూర్లో భాగంగా చంద్రబాబు విడుదల చేసిన బ్రోచర్లో ఈ విషయం వెలుగు చూసింది. జపాన్ ప్రభుత్వాధినేతలు, పారిశ్రామిక వేత్తల కోసం రూపొందించిన ఈ బ్రోచర్లో..మొత్తం రాజధాని ప్రాంతాన్ని మూడు వృత్తాల్లో చూపించారు. మొదటి వృత్తాన్ని కోర్ రాజధాని ప్రాంతంగా పేర్కొన్నారు. దీని పరిధిలోకి 12వేల హెక్టార్లు వస్తాయి. రెండో వృత్తంలో 25-30 వేల హెక్టార్లు వస్తాయని బ్రోచర్లోనే పేర్కొన్నారు. ఇంతవరకూ ఓకే.. కానీ దీంతో పాటు మూడో వృత్తాన్ని కూడా పేర్కొని.. దాన్ని పరిధిలోకి 0.8 -0.9 మిలియన్ హెక్టార్ల మెట్రోపాలిటన్ రీజియన్ గా తెలిపారు.                                      ఇప్పుడీ మూడో వృత్తపరిథిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పారిశ్రామిక వేత్తల అవగాహన కోసమే పేర్కొన్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు బ్రోచర్లో పేర్కొన్నందువల్ల.. మెట్రో పాలిటన్ రీజియన్ కోసం కూడా భూసమీకరణ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. 0.8-0.9 మిలియన్ హెక్టార్లంటే.. దాదాపు 23 లక్షల ఎకరాలు అవుతుంది. అంత ప్రాంతాన్ని భూసమీకరణ ద్వారా సేకరించడమంటే మామూలు విషయం కాదు. ఐతే.. దాన్ని మెట్రోపాలిటన్ రీజయన్ గా చెబుతున్నందువల్ల.. అవగాహన కోసమే ప్రస్తావించి ఉంటారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం కాస్త వివరణ ఇస్తే బావుంటుందేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: