ఆయనో కేంద్రమంత్రి.. అంతకుముందు ఆయన టీడీపీ ఎంపీ.. ఈ రెండింటి కంటే ముందు ఆయనో పారిశ్రామికవేత్త.. ప్రజానాయకుడు కాకపోయినా.. తెర వెనుక రాజకీయాలు నడపడంలో దిట్ట.. ధనబలం, వ్యూహబలంతోనే ఆయన అధినేత చంద్రబాబు మనసు చూరగొన్నారు. అందుకే ఎందరు అడ్డుచెప్పినా వినకుండా ఆయన్ను చంద్రబాబు కేంద్ర మంత్రిని చేసేశారు. ఇంతచెప్పాక.. ఆయనెవరో మీకు తెలిసే ఉంటుంది. మీరు ఊహించినట్టు ఆయన సుజనాచౌదరి గా ప్రసిద్ధుడైన వైఎస్ సత్యనారాయణ చౌదరే. టీడీపీ కోటా ప్రకారం చంద్రబాబు సూచించిన వారికి మంత్రిపదవులు ఇచ్చిన మోడీ.. సుజనా ట్రాక్ రికార్డుతో రాజకీయంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేంద్రమంత్రివర్గాన్ని విస్తరించిన రోజే.. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు.. సుజనాకు మంత్రిపదవి కట్టబెట్టడాన్ని తప్పుబట్టాయి. సుజనాచౌదరికి చెందిన కంపెనీ కోట్లరూపాయల బకాయిల్లో ఉందని.. దానిపై కేసులు కూడా ఉన్నాయని విమర్శించింది. ఐతే.. ఈ కంపెనీకి తనకూ సంబంధం లేదని సుజనాచౌదరి తెలిపారు. కంపెనీ వ్యవహారాల్లో ఇలాంటివి చాలా సాధారణమని సుజనా అనుచరులు చెప్పుకొచ్చారు. ఐతే.. బకాయిలు చెల్లించే విషయంలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేసిన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని మారిషస్ కమర్షియల్ బ్యాంకు లిమిటెడ్ సోమవారం హైకోర్టు తెలపడం విశేషం. 100 కోట్ల బకాయిలను సుజనా వాయిదాల పద్దతిలో చెల్లిస్తానని తెలిపిందని.. తాను అందుకు అంగీకరించడంలేదని వివరించింది. హేస్టియా అనే కంపెనీ తనకు 100 కోట్లు బకాయిలు చెల్లించాలని.. ఇందుకు సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హామీగా ఉందని కోర్టు కు వివరించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కిరాకపోవడం సుజనాకు రాజకీయంగా ఇబ్బంది కలిగించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: