ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మానవ హక్కుల సంఘానికి ఒక ఆసక్తికరమైన ఫిర్యాదు అందింది. మంత్రి హోదాలో ఉన్న ఆయన తమను చంపాలని చూస్తున్నాడని కొంతమంది గిరిజనులు వచ్చి ఫిర్యాదు చేశారు. విశాఖ ప్రాంతానికి చెందిన వీళ్లంతా మంత్రిపై హైదరాబాద్ కు వచ్చి మరి ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం. మరి రాజకీయాల్లో , అధికార పార్టీ నేతగా బిజీగా ఉన్న గంటాపై గిరిజనులు ఫిర్యాదు చేయడం ఎందుకు? అంటే.. గంటా శ్రీనివాసరావు సదరు గిరిజనులపై కక్ష గట్టాడట. ఈయన వారిని చంపాలని ప్రయత్నిస్తున్నాడట. ఈ మేరకు వారిని గంటా అనుచరులు హెచ్చరించి వచ్చారట. దీంతో బెంబేలెత్తిపోతున్నామని గిరిజనులు అంటున్నారు. గంటా నుంచి తమకు ప్రాణహాని పొంచి ఉందని వారు హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వీరు కోరుతున్నారు. మరి గిరిజనులకు, గంటాకు వివాదం ఏమిటి ? అంటే.. వాళ్లంతా మొన్నటి ఎన్నికల్లో గంటాకు అనుకూలంగా పనిచేయలేదట. దీంతో వీరి మధ్య వివాదం రేగిందట. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గంటా, ఆయన అనుచరులు తమను చంపాలని చూస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వివాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మానవహక్కుల కమిషన్ విశాఖ ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. మరి అధికార పార్టీ ముఖ్యనేతపై ఇలాంటి ఫిర్యాదులు రావడం ఆసక్తికరమైన అంశమే. మరి పోలీసులు ఈ ఉదంతంపై ఏం తేలుస్తారో! 

మరింత సమాచారం తెలుసుకోండి: