పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు మంగళవారం ప్రతిపక్ష సభ్యులు వినూత్న నిరసనతో సభను కొద్దిసేపు స్తంభింప జేశారు. నల్లధనం మీద చర్చ చేపట్టాలన్న డిమాండుతో నినాదాలు చేస్తూ వెల్‌లోకి ప్రవేశించారు. తమ సీట్లలో కూచోవలసిందిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించినా వారు వినలేదు. దీంతో స్పీకర్ సభను 40 నిముషాలపాటు వాయిదా వేశారు. తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్-యు, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన ఎంపీలు.. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి బ్లాక్‌మనీ అంశం మీద చర్చ చేపట్టాలని కోరారు. ‘కాలాధన్ వాపస్‌లో’.. నల్లధనాన్ని వెనక్కి రప్పించండి అంటూ స్లోగన్స్ చేశారు. సభ్యుల ఆందోళనలు, నిరసనలతో సభ దద్దరిల్లింది. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తరువాత కూడా ప్రతిపక్షాలు నిరసన కొనసాగించాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు - నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బ్లాక్‌మనీ విషయంలో పదేళ్ళలో యూపీఏ ప్రభుత్వం ఏమీ చేయలేక పోయిందని, తమ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: