అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు ఆ హామీని విస్మరించారు. నల్లధనం వెనక్కి తీసుకురావడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మండిపడ్డారు. వందరోజుల్లో బ్లాక్‌మనీ వెనక్కి తీసుకొస్తామన్నారు. ఆరు మాసాలు దాటినా ఇంతవరకు దీనిపై చర్యలు లేవు. బ్లాక్‌మనీ వెనక్కి రాలేదు. మీరు ఇచ్చిన హామీ ఏమైందని ములాయం ప్రశ్నించారు. మంగళవారం పార్లమెంట్‌ వెలుపల ములాయం విలేకరులతో మాట్లాడుతూ 'వంద రోజుల్లో బ్లాక్‌మనీని వెనక్కి తీసుకొచ్చి భారతదేశాన్ని సౌభాగ్యవంతంగా తయారు చేస్తామని ప్రధాని చెప్పారు. ఆ బ్లాక్‌మనీతో దేశాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ పని ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు' అని ములాయం అడిగారు. విదేశీ బ్యాంకుల్లో మన నల్లధనం ఎంత వుందో కనీసం ఆ సంఖ్యనైనా అప్పటి యుపిఎ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కనీసం ఎంత నల్లధనం విదేశాల్లో మూలుగుతుందో కూడా చెప్పడం లేదని విమర్శించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడంలో కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికే పలు ఖాతాలు ఖాళీ అయ్యాయన్నారు. ఇది కచ్చితంగా కుట్రలో భాగమేనన్నారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని తప్పుడు హామీలు ఇచ్చి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ములాయం ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలు ఏమాత్రం నెరవేరడం లేదు. ప్రజలను మోసగించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, అవినీతిని అంత మొందిస్తామని బీజేపీ హామీలు గుప్పించింది. అవి ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. కనీసం ఒక్క హామీనైనా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం గురించి మాట్లాడుతూ దీనికి తాము వ్యతిరేకమన్నారు. రైతుల సమ్మతితోనే భూ సేకరణ జరగాలన్నారు. ఎందు కంటే రైతుకు భూమి తప్ప మరో ఆధారం లేదన్నారు. రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా యూపీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌ చేసిన వ్యాఖ్యలపై అడుగగా ఆయన తన పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారు. తాము అలా చేయడానికి సిద్ధంగా లేమన్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడి పరిమితులు దాటాలని తాము కోరుకోవడం లేదన్నారు. నేరుగా గవర్నరుతోనే మాట్లాడతామన్నారు. బ్లాక్‌మనీపై చర్చకు రెడీ బ్లాక్‌మనీపై ప్రతిపక్షాల దాడికి సంబంధించి బీజేపీ స్పందించింది. ఈ సమస్య నుండి బయటపడేందుకు నానాతంటాలు పడుతోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. నల్లధనం అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా వుందని చెప్పింది. 'విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తేవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కట్టుబడి వున్నాం. బ్లాక్‌మనీపై చర్చకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా వుంది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి చేస్తున్న కృషిపై వాస్తవాలు వెల్లడించటానికి మేము పూర్తి సన్నద్ధంగా వున్నాం' అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ చెప్పారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం రూడీ విలేకరు లతో మాట్లాడారు. సమావేశాన్ని పార్లమెంట్‌ హౌస్‌ లైబ్రరీకి మార్చారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఫలవంతమయ్యేందుకు కృషి చేయాలని తమ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేయగా జీఎస్టీపై ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వివరించారు. ఈ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నదని, వచ్చే సమావేశాల్లో ఆమోదం పొందుతుందని జైట్లీ చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతు న్నాయని, వారి భయాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని ఆర్థికమంత్రి చెప్పారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతిపక్షాలకు వివరించాలని, దీనిని అవకాశంగా తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నదని రూడీ చెప్పారు. జీఎస్టీ బిల్లుపై ప్రభుత్వం ఆతృతగా వుందని, ఈ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి వచ్చే సమావేశాల్లో ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని రూడీ పేర్కొన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని మంత్రి తెలిపారు. దీనిపై కచ్చితంగా ఏకాభిప్రాయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. 2016 నుండి జీఎస్టీని దేశంలో అమలు చేస్తామని చెప్పారు. సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పార్టీ ఎంపీలంతా సమావేశానికి హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: