తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీల మధ్య రోజురోజుకూ ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. వీరి పోరుతో అసెంబ్లీ అట్టుడుకిపోతుంటే.. అసెంబ్లీ బయట కూడా అదే సీన్ రిపీటవుతోంది. ఇప్పుడు రాజకీయ వివాదాలు, విమర్శలకు తోడు... అసెంబ్లీ కార్యాలయాల కేటాయింపు విషయాల్లోనూ రచ్చ రంబోలా అవుతోంది. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ కార్యాలయం ఏర్పాటు అంశంపై మరోసారి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఈ మధ్య టీటీడీపీ నేతలకు ఆంధ్రానేతలుగా చిత్రీకరిస్తున్న గులాబీ నేతలు.. విమర్శల జోరు పెంచారు. టీడీపీ నేతలు ఆంధ్రకు కేటాయించిన లాబీల్లోనే కాలం గడుపుతూ తమ పక్షపాత బుద్ది చూపుతున్నారని ఏకంగా మంత్రి హరీశ్ రావే కామెంట్ చేశారు.                           హరీశ్ కామెంట్ తో రెచ్చిపోయిన టీటీడీపీ నేతలు .. తమకు ఇంతవరకూ అసెంబ్లీ లాబీల్లో గదులు కేటాయించని సంగతి గుర్తు చేశారు. తమకు గదులు కేటాయించనందువల్లే ఏపీ గదుల్లో కూర్చొంటున్నామని చెప్పుకొచ్చారు. మొదట తమకు కేటాయించిన గదులు... అనుకూలంగా లేవని విమర్శించిన టీడీపీ నేతలు.. వేరే గదుల కోసం స్పీకర్ ను వినతి పత్రం సమర్పించుకున్నారు. కొత్త గదులు కేటాయించడంలో చాలా ఆలస్యమవుతోందన్న టీటీడీపీ నేతలు.. ఒక్కరోజులో ఆ పని చేయకపోతే.. మంత్రి హరీశ్ రావు గదినే ఆక్రమిస్తామని సవాల్ విసిరారు. గదులు కేటాయింపు జరక్కపోతే.. హరీశ్ రావు గది ముందు బోర్డు పీకేసి ఆక్రమించుకుంటామన్నారు.                     టీడీపీ నేతల కామెంట్ పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నా ఆఫీస్ బోర్డు తీసేస్తారా.. తీసేయండి ఏం జరుగుతుందో చూద్దామని హరీశ్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. గదుల కేటాయింపులో అనేక సమస్యలున్నాయని హరీశ్ వివరించారు. ఈ సమస్య ఒక్క టీడీపీదే కాదని... చాలా పార్టీలకు సరైన గదులు కేటాయించలేకపోయామని తెలిపారు. టీడీపీకి మొదట ఇచ్చిన గదుల మరమ్మత్తులకు కూడా నిధులిచ్చామని గుర్తు చేశారు. నిధుల సంగతి సరే.. మరి ఎర్రబెల్లి హరీశ్ కు 24 గంటల టైమ్ ఇచ్చారు. మరి ఆ టైమ్ లోపల గదుల కేటాయింపు జరక్కపోతే.. టీటీడీపీ నేతలు ఏంచేస్తారో.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: